వరంగల్లో తీవ్ర స్థాయిలో వరదలు..ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి

వరంగల్లో  తీవ్ర స్థాయిలో వరదలు..ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి

వరంగల్ నగర  వరదల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. వర్షాల కారణంగా వరంగల్ సిటీలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయని..ముంపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని..బాధితులకు తాగునీరు, నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లు అందించాలన్నారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనావేస్తోందని చెప్పారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం అని ప్రశంసించారు. 

ఆగస్టు 2వ తేదీ వరంగల్ నగరానికి చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ...ముందుగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత నయీమ్ నగర్ నాలాను పరిశీలించారు. నయీమ్ నగర్ లో  నాలా ఆక్రమణలను  కార్పొరేటర్ స్వాతి రెడ్డి గవర్నర్ కు వివరించారు. అనంతరం జవహార్ నగర్ లో ముంపు ప్రాంతాల వాసులకు  రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. అక్కడి నుంచి పోతన నగర్ పర్యటించిన తమిళిసై...ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితుల గోడు అడిగి తెలుసుకున్నారు. భద్రకాళీ చెరువు కట్ట తెగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రంగంపేటలో కాన్వాయ్ ఆపి వరద బాధితులతో మాట్లాడారు. గవర్నర్ కు స్థానికులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్బంగా బాధితులకు సాయం అందేలా చూస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు.