
నిమ్స్ హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న బాధితులను గవర్నర్ తమిళిసై పరామర్శించారు. వారి ఆరోగ్య సమాచారాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. నిమ్స్ లో వైద్యుల ట్రీట్ మెంట్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులు కూడా తమకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారని..దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయం అందేలా చూస్తామన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ ఆపరేషన్లు చేయాలన్న టార్గెట్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని హెచ్చరించారు. కుటుంబ నియంత్రణ అంటే మరింత మంది ముందుకు వచ్చేలా చేయాలన్నారు. ఇలా ఆపరేషన్లు వికటిస్తే ముందుకు వచ్చేవారి ధైర్యం దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు సజావుగా జరగాలన్నారు.
ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మృతి చెదడం బాధాకరమని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. రిపోర్ట్ వచ్చాక అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటానని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపయాలు మెరుగుపరచాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు.