రాజ్యాంగాన్ని అవమానిస్తరా?

రాజ్యాంగాన్ని అవమానిస్తరా?
  • వ్యక్తిగతంగా అవమానించినా... కనీసం పదవికి మర్యాద ఇవ్వాలి
  • గవర్నర్​ టూర్​కు ఎలా వ్యవహరించాలో సీఎస్​కు, కలెక్టర్లకు తెలియదా?
  • దీనిపై చర్యలు తీసుకోవచ్చు.. అయినా ఆ జోలికి వెళ్లదలచుకోలేదు
  • నేను రాజకీయాలు చేయడం లేదు..  రాష్ట్రంలోని పరిణామాలు ప్రధాని సహా అందరికీ తెలుసు
  • రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నరు.. 
  • ఎంజీఎంలో పేషెంట్​పై ఎలుకల దాడి ఘటన కలిచివేసింది
  • జనం సంక్షేమమే నా లక్ష్యం: గవర్నర్​ తమిళిసై

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగాన్ని, రాజ్​భవన్​ను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అవమానిస్తున్నారని గవర్నర్​ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్​ను కూడా పాటించడం లేదని, ఇదేం పద్ధతి అని నిలదీశారు. ‘‘గవర్నర్​ పదవిలో ఇవాళ నేను ఉండొచ్చు.. రేపు ఇంకొకరు ఉండొచ్చు... ఎవరు ఆ పదవిలో ఉన్నా 
రాజ్యాంగబద్ధమైన గవర్నర్​ పదవికి, గవర్నర్​ ఆఫీసుకు గౌరవం ఇవ్వాలి. అవమానపరచడం ఏమిటి?” అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, తనను వ్యక్తిగతంగా అవమానపరిచినా పెద్దగా పట్టించుకోనని, అయితే వ్యవస్థలను అవమానించడం మంచి సంస్కృతి కాదన్నారు. ‘‘చీఫ్​ సెక్రటరీకి, కలెక్టర్లకు, ఎస్పీలకు ప్రొటోకాల్​ తెలియదా? గవర్నర్​ టూర్​లో ఎలా వ్యవహరించాలో తెలియదా?’’ అని మండిపడ్డారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలు ప్రధాని నరేంద్రమోడీకి సహా ప్రజలందరికీ తెలుసని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిర్ణయాన్ని ప్రజలకు వదిలేస్తున్నానని, ఏది తప్పో, ఏది ఒప్పో వాళ్లే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. గవర్నర్​ పదవి రాజకీయాలకు అతీతమైందని, తాను ఏనాడూ రాజకీయాలు చేయలేదని, అలా చేస్తే బయటపెట్టాలన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళి సై బుధవారం పార్లమెంట్ లో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం గవర్నర్​ తమిళిసై తెలంగాణ భవన్​లోని శబరి బ్లాక్ లో మీడియాతో మాట్లాడారు. 

చట్టాలకు లోబడే పనిచేస్తా
రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న తాను ఆ చట్టాలకు లోబడే పని చేస్తానని గవర్నర్​ తెలిపారు. వ్యవస్థలను, చట్టాన్ని తాను గౌరవిస్తానని, వాటి ప్రకారమే ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ‘‘వ్యక్తిగతంగా నన్ను అవమానిస్తున్నా... దాని గురించి పెద్దగా పట్టించుకోను. గవర్నర్ అంటే తమిళి సై కాదు..  ఆ పదవి రాజ్యంగబద్ధమైనది. ఆ హోదాలో ఉన్న గవర్నర్​కు, రాజ్​భవన్​కు కనీస మర్యాద ఇవ్వాలి కదా? గవర్నర్  పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో రాష్ట్రంలోని ప్రజలంతా చూస్తున్నారు. నాకు ఎలాంటి ఇగోలు లేవు. వివాదాస్పద వ్యక్తిని కాదు” అని చెప్పారు. కరోనా ప్యాండమిక్​ టైంలో ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చానని ఆమె గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల ఎందుకు అవమానకరంగా వ్యవహరిస్తుందో తెలియడం లేదన్నారు. ‘‘గవర్నర్ ను ఎందుకు అవమానిస్తున్నారనే ప్రశ్న ను ప్రభుత్వాన్నే అడగాలి’’ అని మీడియా ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మంచి చేయాలనే తన ప్రయాణాన్ని ఆపబోనని స్పష్టం చేశారు.  

సీఎస్​కు ప్రొటోకాల్​ తెలియదా?
రాష్ట్ర పర్యటనకు గవర్నర్​ హోదాలో తాను వెళ్తే అధికారులు రాకపోవడం, ప్రొటోకాల్స్ కల్పించకపోవడం ఏమిటని గవర్నర్​ తమిళిసై ప్రశ్నించారు. ‘‘స్వాగతం పలికేందుకు కలెక్టర్, ఎస్పీ రావద్దనే నిబంధన ఏమైనా ఉందా? గవర్నర్​ టూర్​కు ఎలా వ్యవహరించాలో సీఎస్​కు, కలెక్టర్లకు, ఎస్పీలకు తెలియదా?” అని మండిపడ్డారు. ఈ విధంగా తనను అవమానించినందుకు బాధలేదని, గవర్నర్ ఆఫీసు, అధికారాలపై తాను ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. గవర్నర్​ ఆఫీసుతో ఇలాంటివి రిపీట్​ కావొద్దని హితవుపలికారు. తన దగ్గర రాజ్యాంగబద్ధ అధికారాలు ఉన్నా.. వాటిని ఇలాంటి అంశాల్లో అమలు చేయదలచుకోలేదన్నారు. తన పర్యటనలు, పనులు ప్రజల కోసమేనని తేల్చిచెప్పారు. ప్రజల వైపు, ప్రజల కోసం పాజిటివ్​ వేలో వెళ్తానని స్పష్ట చేశారు.

కేంద్రానికి రిపోర్టు ఇవ్వాల్సిన అవసరం లేదు
రాజ్ భవన్,  ప్రగతి భవన్ మధ్య దూరంపై కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు గవర్నర్​ బదులిచ్చారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసని, మీడియాలో కూడా స్పష్టంగా చూపిస్తున్నారని చెప్పారు. ‘‘నేను మహిళా గవర్నర్​ను. ఫ్రెండ్లీ గవర్నర్​ను. ట్రాన్ఫారెంట్ గవర్నర్ ను. పారదర్శకంగా నా విధులు నిర్వహిస్తాను. ప్రజలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు రాజ్​భవన్ లో అందుబాటులో ఉంటాను” అని స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటానని చెప్పారు. అన్ని అంశాలపై తీర్పును ప్రజలకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

పీపుల్ ఫ్రెండ్లీ యాక్టివిటీని ప్రధానికి వివరించా
రాష్ట్రంలో చేపట్టిన ట్రైబల్ టూర్ గురించి ప్రధానికి వివరించానని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. రాష్ట్రంలో 11 శాతం ట్రైబల్ పాపులేషన్ ఉందని చెప్పారు. ‘‘ఇటీవల నేను 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, 15 కిలో మీటర్ల అడవిలో ప్రయాణించి చెంచులు నివసించే ప్రాంతాలను సందర్శించాను. అందులో 6 గ్రామాలను దత్తత తీసుకున్నాను. ఆ వివరాలు, అక్కడి పరిస్థితులను ప్రధాని మోడీకి తెలిపారు. నా ఫోకస్ తెలంగాణ ప్రజల సంక్షేమంపైనే ఉంటుంది. పీపుల్ ప్రెండ్లీ యాక్టివిటీస్​ని ప్రధానికి వివరించాను” అని తెలిపారు.  తెలంగాణ, పుదుచ్ఛేరి రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి పలు అభివృద్ధి ప్రణాళికలను ప్రధానికి అందించానన్నారు. సుహృద్భావ వాతావరణంలో ప్రధానితో భేటీ జరిగిందని, చాలా అంశాలపై ఆయన సలహాలు ఇచ్చారని గవర్నర్​ తెలిపారు. దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ పై తాను ఒక డాక్టర్ గా ప్రధానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ తోనే ప్రస్తుతం మనమందరం క్షేమంగా ఉన్నామన్నారు. పుదుచ్ఛేరి నుంచి హైదరాబాద్ కు విమాన సర్వీసులను ప్రారంభించినందుకు ప్రధానికి ధన్యావాదాలు తెలిపినట్లు వెల్లడించారు. ఈ డైరెక్ట్ కనెక్టివిటీ ద్వారా రెండు ప్రాంతాల మధ్య బంధం బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. 

ఉగాదికి పిలిస్తే ఎందుకు రాలేదో కారణాలు కూడా చెప్పలేదు
రాజ్​భవన్​కు సీఎం, మంత్రులు సహా అందరూ రావొచ్చని, ఎలాంటి సమస్యమీదైనా చర్చించేందుకు అందుబాటులో ఉంటానని గవర్నర్​ తమిళిసై అన్నారు. ‘‘గతంలో గవర్నర్ అడ్రస్ కోసం ప్రభుత్వం రిపోర్ట్ కార్డు ఇచ్చేది. అందులోని అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాను. పలు అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చాను. కానీ,  ఇప్పుడు ఎలాంటి రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం లేదు. నాకు ప్రభుత్వం, అధికారుల తీరుపై సమస్య సృష్టించాలని ఏమాత్రం లేదు” అని పేర్కొన్నారు. తనకు ప్రొటోకాల్ కల్పించని అధికారులపై ఒక వేళ ఏమైనా చర్యలు తీసుకొని ఉంటే గవర్నర్ నిర్ణయాలను తప్పుబట్టేవారని అన్నారు. తాను చాలా ఫ్రెండ్లీ పర్సన్​ని, ఎలాంటి ఇగో లేదని చెప్పారు. రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలకు ఆహ్వానిస్తే సీఎం, మంత్రులు రాలేదని, కనీసం కారణాలు కూడా తెలపలేదని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రతీది ఆమోదించాల్నా?
తాను ఏ అంశాన్ని కూడా రాజకీయం చేయలేదని గవర్నర్​ అన్నారు. పాడి కౌశిక్​రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘అది గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ.. ప్రధాని కోటానో వేరే కోటానో కాదు.. గవర్నర్​ కోటాలోని సేవారంగానికి సంబం ధించిన అంశమది. ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తి (కౌశిక్​రెడ్డి) చేసిన సేవలు ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను. ఆ సేవలు ఏమిటో ప్రభుత్వాన్ని అడిగాను. అందులో తప్పేముంది? అది గవర్నర్​గా నా హక్కు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. అది రాజ్యాంగబద్ధమైన నిర్ణయం. ప్రతీది ఆమోదించాలంటే ఎట్లా..? ఆమోదించకపోతే గవర్నర్​ వ్యవస్థను అవమానిస్తరా? ప్రొటోకాల్​ పాటించరా?”అని తమిళిసై అన్నారు. 

దవాఖాన్ల సమస్యలపై ఒక డాక్టర్​గా రిక్వెస్ట్​ చేసిన
మొదటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు గవర్నర్​ తమిళిసై చెప్పారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఎలుకల దాడిలో వ్యక్తి చనిపోవడం తనను కలచివేసిందన్నారు.  ‘‘దవాఖాన్ల సమస్యలపై ఒక గవర్నర్ గా కాకుండా, ఒక డాక్టర్ గా రిక్వెస్ట్​ చేశాను. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మొదటి నుంచి కోరుతూ వస్తున్నారు. గవర్నమెంట్​హాస్పిటల్స్​కు  ప్రజలకు మెరుగైన వైద్యం అందాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నేను  వ్యవహరిస్తున్న తీరు సరైందా? కాదా? అన్నది ప్రజలకే వదిలేస్తున్నా” అని చెప్పారు. 

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ
గవర్నర్ తమిళిసై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం పార్లమెంట్ లోని మంత్రి చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి చాంబర్ కు వెళ్లే మార్గంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఎదురుపడగా గవర్నర్​ పలుకరించారు.