
- వచ్చే నెల ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ముగింపు
- పరిశీలనలో తుమ్మల, గంటా చక్రపాణి, దాసోజు పేర్లు
- క్రిస్టియన్ కోటాలో రాజేశ్వర్ రావు, రాజీవ్ సాగర్, విద్యావర్ధిని
- పొలిటికల్ ఈక్వేషన్లను లెక్కలేసుకుంటున్న గులాబీ బాస్
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను కేసీఆర్ ఎవరికి కట్టబెట్టబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్ పదవీ కాలం వచ్చేనెల 27తో ముగియనుంది. ప్రస్తుతం రాజేశ్వరరావు క్రిస్టియన్ మైనార్టీ, ఫారూఖ్ హుస్సేన్ ముస్లిం మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. తనకు మరో మారు రెన్యూవల్ చేయాలని రాజేశ్వరరావు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ రావు వరుసగా మూడో సారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీకి మాజీ కో ఆప్షన్ సభ్యురాలు విద్యావర్ధని కూడా క్రిస్టియన్ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇదే కోటాలో ఎమ్మెల్సీ కవిత అనుచరుడు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పేరు కూడావినిపిస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కూడా వచ్చే నెలలో రిటైర్ కానున్నారు. ఫారూఖ్ హుస్సేన్ మరోమారు రెన్యూవల్ చేయాలని అధినేతను కోరినట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు కొనసాగుతున్న ఈ పదవులను అదే సామాజిక వర్గానికి కేటాయిస్తారా..? ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు కేటాయిస్తారా..? అనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ పదవిని ఎస్సీలకు కేటాయిస్తారా? అనే చర్చకూడా ఉంది. బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తే ఎవరు ఎమ్మెల్సీ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున సామాజిక వర్గాలు, పొలిటికల్ ఈక్వెషన్లను పరిగణనలోకి తీసుకొని కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
రేసులో తుమ్మల, గంటా, దాసోజు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి, ఇటీవలే బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన శ్రవణ్ దాసోజు, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కామ్రేడ్లతో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో తుమ్మల నాగేశ్వర్ రావుకు అవకాశం కల్పిస్తారనే చర్చ కూడా ఉంది. పాలేరు సీటును పొత్తులో భాగంగా సీపీఎం కోరుతోంది.
తుమ్మలను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని అధినేత భావిస్తున్నారని సమాచారం. ఖైరతాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొనసాగుతున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రవణ్ దాసోజు పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ద్వారా ఆ సెగ్మెంట్ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ప్రచారం ఉంది. గౌడ సామాజికవర్గానికి చెందిన వారెవరూ అసెంబ్లీలో, మండలిలో లేరు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన వీజీగౌడ్ ఇటీవలే ఎమ్మెల్సీగా రిటైర్ అయ్యారు.
గౌడ్ ఈక్వేషన్ ను పరిగణనలోకి తీసుకుంటే మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ లో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంటా చక్రపాణి పేరు సైతం పరిశీలనలో ఉంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నందున పొలిటికల్ ఈక్వేషన్లు, సర్దుబాట్లను పరిగణనలోకి తీసుకొన్న మీదటే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.