బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితి చూసి చలించిపోయా

బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితి చూసి చలించిపోయా

మహిళా గవర్నర్ ను అయినందుకు తనపై వివక్ష చూపించారని గవర్నర్ తమిళి సై అన్నారు. రాష్ట్ర గవర్నర్ గా తమిళిసై ఇవాళ్టితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో మాట్లాడిన గవర్నర్..  ఎన్ని ఆటంకాలు ఎదురైనా  ముందుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఇంకా పని చేస్తానన్నారు.  సన్మానం చేసినా చేయకపోయినా  పని చేశానన్నారు.  గౌరవం ఇవ్వక పోతే తానేం తక్కువ కాదన్నారు.   రాజ్ భవన్ ను ప్రజా భవన్ గా మార్చామని... పేద ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచామన్నారు. ఆదివాసీ గూడెంలను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఆదివాసీల కోసం మెడికల్ క్యాంపు, అంబులెన్స్, ఆర్థిక పరిపుష్టత కోసం పని చేశామన్నారు.

మహిళా దర్బార్, విద్యార్థుల కోసం పోటీ పరీక్షలు నిర్వహించామని గవర్నర్ తమిళి సై అన్నారు. యూనివర్సిటిలలో ఉన్న విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాశానని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తన వంతు సహాయం  చేశానని చెప్పారు. పేద ప్రజల మీద ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నానన్నారు.. తాను చెసే ప్రతి పని పేద ప్రజల కోసమేనన్నారు.  మేడారం వెళ్ళినప్పుడు దాదాపు 8 గంటల పాటు కారులో ప్రయాణం చేశానని అన్నారు.  తెలంగాణ ప్రాంతం సంస్కృతి సంప్రదాయాలతో ముడి పడి ఉంటుందన్నారు. 

బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితి దయనీయం

బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన గవర్నర్  ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి వ్యక్తి గత ద్వేషాలు లేవన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నవి ప్రజల కోసమేనన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా కూడా గవర్నర్ ను అవమానించారన్నారు. గవర్నర్ ప్రోటోకాల్ ను పూర్తిగా తుంగలో తొక్కారన్నారు.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు.