- సర్కారు సంస్థలకు ఫ్యూచర్ సిటీ, శంషాబాద్లో భూముల కేటాయింపు
- త్వరలో ప్రాజెక్టు మొదటిదశ పనులు షురూ
- కొత్త భవనాల డిజైన్ల కోసం కన్సల్టెంట్లకు ఆహ్వానం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భవనాలను వేరే ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. గండిపేట సమీపంలోని నార్సింగి నుంచి బాపూఘాట్ వరకు చేపట్టే మొదటి విడత అభివృద్ధి ప్రాజెక్టులో కొన్ని కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాలు అడ్డుగా ఉన్నట్టు ఎంఆర్డీసీఎల్ అధికారులు తెలిపారు. ఈ కారణంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలో ఉన్న వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(వాలంతరి), రాజేంద్ర నగర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్(ఐసీఎం), తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(టీజీఐఆర్డీ), తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్సట్ బ్యాంక్ ట్రెయినింగ్ సెంటర్ (టీజీసీఏబీ), ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్స్అండ్ ఫ్లవర్ మార్కెట్లను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి తరలించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ భవనాలకు ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్‌సిటీ, శంషాబాద్‌లోని హెచ్ఎండీఏ లేఔట్స్‌లో భూములను కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల నుంచి ఓఆర్ఆర్ కు మెరుగైన కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎంఆర్డీసీఎల్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కొత్త భవనాల నిర్మాణాల కోసం కన్సల్టెంట్లకు ఆహ్వానం
మూసీ పరీవాహక ప్రాంతాల నుంచి తరలించే ఆయా ఇన్స్టిట్యూషన్లకు ఫ్యూచర్‌సిటీ, శంషాబాద్లో అవసరమైన భూములను కేటాయించనున్నారు. అంతే కాకుండా కొత్త భవనాల నిర్మాణానికి డిటెయిల్డ్ ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ డిజైన్ల కోసం పేరు పొందిన కన్సల్టెంట్స్ను నియమించేందుకు త్వరలో టెండర్లను పిలవ నున్నట్టు ఎంఆర్డీసీఎల్ ఉన్నతాధికారులు తెలిపారు. కన్సల్టెంట్స్ ఆర్కిటెక్చర్, లే ఔట్ప్లాన్లకు సంబంధించి డీపీఆర్‌లను సమర్పించిన తర్వాత భవనాల నిర్మాణాలను చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఆయా భవనాల నిర్మాణాలకు సంబంధించి ఇండియన్ స్టాండర్డ్ కోడ్(ఐఎస్), నేషనల్ బిల్డింగ్ కోడ్(ఎన్బీసీ), కన్జర్వేషన్ బిల్డింగ్కోడ్(ఈసీబీసీ), తెలంగాణ బిల్డింగ్ రెగ్యులేషన్, ఫ్యూచర్‌సిటీ ప్లానింగ్ అండ్ సస్టెయినబులిటీ గైడ్‌లైన్స్ వంటి నార్మ్స్కు తగ్గట్టుగా ఆయా భవనాలను నిర్మించడానికి ఎంఆర్డీసీఎల్ కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.
