ఈసీఎంఎస్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద 7 ప్రాజెక్టులకు ఆమోదం

ఈసీఎంఎస్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద 7 ప్రాజెక్టులకు ఆమోదం

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ (ఈసీఎంఎస్‌‌‌‌‌‌‌‌)  కింద మొదటి దశలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను ప్రకటించింది.   మొత్తం రూ.5,532 కోట్ల పెట్టుబడితో ఏడు   ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా రూ.44,406 కోట్ల విలువైన ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌, మొదటి దశలో 5 వేలకి పైగా ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ ద్వారా భారత్​ను కేవలం అసెంబ్లింగ్‌‌‌‌‌‌‌‌కు  కేంద్రంగా కాకుండా, ఎలక్ట్రానిక్స్‌ ప్రధాన భాగాలను తయారు చేసే హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. 

కేన్స్ సర్క్యూట్స్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌, సిర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌, అసెంట్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్స్‌‌‌‌‌‌‌‌ తాజాగా అనుమతులు పొందాయి.  ఏడు ప్రాజెక్టులలో  ఐదు ప్రాజెక్టులు తమిళనాడులోనే ఉన్నాయి. మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (పీసీబీలు), హెచ్‌‌‌‌‌‌‌‌డీఐ బోర్డులు, కాపర్ లామినేట్లు, కెమెరా మాడ్యూళ్లను కేన్స్ సర్క్యూట్స్  తయారు చేస్తుంది. ఈ కంపెనీ సబ్మిట్ చేసిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ కెపాసిటర్లకు అవసరమైన ప్రాపిలీన్ ఫిల్మ్ తయారు చేస్తుంది. సిర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌, అసెంట్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్స్‌‌‌‌‌‌‌‌ మల్టీ లేయర్ పీసీబీలను తయారు చేస్తాయి.  ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ కింద  249 దరఖాస్తులు వచ్చాయని, రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు అందాయని ఎలక్ట్రానిక్స్ మినిస్టర్‌‌ అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. మొదట్లో పెట్టుకున్న టార్గెట్ రూ.59,350 కోట్లకు ఇది రెట్టింపని తెలిపారు. ఈ ప్రాజెక్టులు దేశీయ డిమాండ్‌‌‌‌‌‌‌‌లో 20శాతం హెచ్‌‌‌‌‌‌‌‌డీఐ పీసీబీలు,  15శాతం కెమెరా మాడ్యూళ్లు, 100శాతం కాపర్ లామినేట్ల అవసరాన్ని తీర్చగలవు.  ఈ స్కీమ్ కింద  తదుపరి దశల్లో మెషీన్ల తయారీపై దృష్టి ఉంటుంది.