ఇథనాల్ తయారీకి చెరుకు వాడొచ్చు.. ఉత్తర్వులను సవరించిన కేంద్రం

ఇథనాల్ తయారీకి చెరుకు వాడొచ్చు.. ఉత్తర్వులను సవరించిన కేంద్రం

న్యూఢిల్లీ :  ఇథనాల్ తయారీకి చెరకు రసాన్ని ఉపయోగించడంపై నిషేధాన్ని రద్దు చేస్తూ కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2023-–24 సరఫరా సంవత్సరంలో దీనిని ఉత్పత్తి చేయడానికి బీ–-హెవీ మొలాసిస్ కూడా ఉపయోగించుకోవచ్చు.  దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో తగినంత చక్కెర సరఫరాను ఉంచడానికి,  ధరలను కంట్రోల్​ చేయడానికి 2023-–24 సరఫరా సంవత్సరానికి (నవంబర్–-అక్టోబర్) చెరకు రసం,  చక్కెర సిరప్‌‌‌‌‌‌‌‌ను ఇథనాల్​తయారీకి ఉపయోగించడాన్ని కేంద్రం నిషేధించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది.  

కొత్త  కాంట్రాక్టులు వచ్చిన తర్వాత ఆహార మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని ఓఎంసీలను కోరింది. సవరించిన కాంట్రాక్టులు అందిన తర్వాత చక్కెర మిల్లులు, డిస్టిలరీలు నిబంధనల ప్రకారం ఓఎంసీలకు ఇథనాల్​ సరఫరా చేస్తాయి. రెక్టిఫైడ్ స్పిరిట్,  అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ ఉత్పత్తికి మాత్రం చెరకు రసం,  బి–హెవీ మొలాసిస్‌‌‌‌‌‌‌‌ల మళ్లింపు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని మొలాసిస్ ఆధారిత డిస్టిలరీలు, సి–-హెవీ మొలాసిస్ నుంచి ఇథనాల్‌‌‌‌‌‌‌‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తాయి.

శుక్రవారం జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ప్రస్తుత 2023–-24 సరఫరా సంవత్సరంలో 17 లక్షల టన్నుల వరకు చక్కెర మళ్లింపునకు అనుమతించామని, చెరకు రసం,  బి–హెవీ మొలాసిస్ రెండింటినీ ఉపయోగించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు.  చక్కెర ఉత్పత్తి గత సీజన్‌‌‌‌‌‌‌‌లో 37.3 మిలియన్ టన్నులు ఉండగా, 2023--–24 సీజన్‌‌‌‌‌‌‌‌లో (అక్టోబర్--సెప్టెంబర్)  32.3-33 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా.