పోలీసు సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ తయారీకి ప్రభుత్వం చర్యలు

పోలీసు సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ తయారీకి ప్రభుత్వం చర్యలు
  • పైలెట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లా ఎంపిక
  • నేడు  ప్రారంభించనున్న మంత్రి హరీశ్​రావు 

సిద్దిపేట, వెలుగు: పోలీసు సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ తయారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పోలీస్​ హెల్త్ ప్రొఫైల్ తయారీకి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. పోలీస్ హెల్త్ ప్రొఫైల్ తయారీలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో పనిచేసే అధికారులు, సిబ్బందికి సిద్దిపేట గవర్నమెంట్​మెడికల్​ కాలేజీ నిపుణులు విడతలవారీగా బ్లడ్, యూరిన్, బీపీ, షుగర్ తోపాటు మరో 55 రకాల టెస్ట్ లు చేస్తారు.  హార్ట్ ఎటాక్, ఒత్తిడికి గురవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు  అవగాహన కల్పిస్తారు. అదే సమయంలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటి అంశాలను తెలియజేస్తారు.

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న  అధికారులు, పోలీసులు, హోంగార్డులు దాదాపు 1,400 పై చిలుకు సిబ్బంది  హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెండేళ్ల పాటు పైలెట్ ప్రాజెక్టు కొనసాగనుంది. ఇప్పటికే ఈ విషయంపై  సిద్దిపేట గవర్నమెంట్​మెడికల్​ కాలేజీ నిపుణులు పోలీస్ కమిషనరేట్  సిబ్బందికి  సూచనలు ఇచ్చారు. చికిత్సపై  అవగాహన సదస్సులు  నిర్వహించారు. గురువారం మంత్రి హరీశ్​రావు చేతుల మీదుగా పోలీస్ హెల్త్ ఫైల్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు.