వృద్ధులకు బూస్టర్ డోసుపై ఫోనుకు మెసేజ్

వృద్ధులకు బూస్టర్ డోసుపై ఫోనుకు మెసేజ్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్.. వ్యాక్సిన్లకు లొంగకపోవచ్చని, ఇమ్యూనిటీని చేధించుకుని మనిషికి సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించిన నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ బూస్టర్ డోసుపై అన్ని దేశాల్లో చర్చ మొదలైంది. దీంతో మన దేశంలోనూ బూస్టర్ డోసు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే  జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, హెల్త్ సిబ్బంది, 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు ముందు జాగ్రత్తగా మూడు డోసు వ్యాక్సిన్ (బూస్టర్ డోసు) వేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ డోసు ముందుగా ఎవరు వేయించుకోవాలనే దానిపై కేంద్రం ఒక రిపోర్ట్ సిద్ధంగా చేసినట్లుగా తెలుస్తోంది. కొవిన్ పోర్టల్ డేటా ఆధారంగా వరుస క్రమాన్ని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ క్రమంలో బూస్టర్ డోసుకు అర్హులైన వృద్ధుల ఫోన్లకు మెసేజ్ పంపాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వ్యాధి తీవ్రత నుంచి ఉపశమనానికే..

ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్, యూరోప్, యూకే, చైనా సహా ఏ దేశం తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ అయినా సరే ప్రాథమికంగా వ్యాధి తీవ్రతను కొంత మేర తగ్గించేందుకే పని చేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. ఈ వ్యాక్సిన్లు పూర్తిగా వ్యాధిని అడ్డుకోలేవని చెప్పారు. ఇప్పుడు ముందు జాగ్రత్త డోసు (బూస్టర్ డోసు)ను కూడా వ్యాధి తీవ్రత నుంచి ఉపశమనానికి,  హాస్పిటలైజేషన్, మరణించే ముప్పు తగ్గించడానికి వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే వ్యాక్సినేషన్ తర్వాత కూడా మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి అని డాక్టర్ బలరామ్ చెప్పారు. ప్రజలు గుంపులుగా తిరగొద్దని కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి కూడా గతంలో వచ్చిన వేరియంట్లకు చేసినట్లుగానే ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు.