విద్యార్థులు పట్టుదలతో ముందుకెళ్లాలి.. అప్పుడే ఉన్నత ఫలితాలు: డాక్టర్ యశ్వంత్రెడ్డి

విద్యార్థులు పట్టుదలతో ముందుకెళ్లాలి.. అప్పుడే ఉన్నత ఫలితాలు: డాక్టర్ యశ్వంత్రెడ్డి
  • బీ.ఆర్ అంబేద్కర్​కాలేజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
  • హాజరైన కాలేజీ కరస్పాండెంట్  సరోజా వివేక్

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులు కలలు కనడమే కాకుండా వాటిని నెరవేర్చుకునేందుకు అకుంఠిత దీక్ష, పట్టుదలతో ముందుకు వెళ్లాలని ప్రముఖ డాక్టర్ యశ్వంత్ రెడ్డి సూచించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విద్యను అభ్యసిస్తేనే ఉన్నత ఫలితాలు వస్తాయన్నారు. సోమవారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (అటానమస్) కాలేజీలో డిగ్రీ, పీజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి డాక్టర్ యశ్వంత్ రెడ్డి, కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్, సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి హాజరై గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. 

మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. యశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ.. 52 ఏండ్ల అంబేద్కర్ కాలేజీ నుంచి ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాల్లో ఉండడం అభినందనీయమన్నారు. కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తూ విద్యను అందిస్తున్నామని తెలిపారు. నేటి ప్రపంచంలో విద్యకు మించిన ఆయుధం లేదని, అంబేద్కర్ విద్యాసంస్థలను అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి చేస్తామన్నారు. 

విద్యార్థుల సంక్షేమమే మా మిషన్ అని పేర్కొన్నారు. విద్యార్థులు పట్టుదలతో భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగి సమాజ కార్యక్రమాలు చేయాలని సూచించారు. కాలేజీ డైరెక్టర్ యాదగిరి, ప్రిన్సిపల్ డాక్టర్ మట్ట శేఖర్ తోపాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.