- వడ్ల కొనుగోలుకు సర్కారు కొత్త పాలసీ
- క్లీన్ చిట్ ఉన్న మిల్లర్లకు 10 శాతం బ్యాంక్ గ్యారంటీకి ఓకే
- గతంలో డిఫాల్ట్ అయి క్లియర్ చేస్తే 20% ఇవ్వాల్సిందే
- డిఫాల్ట్ మిల్లర్లకు ఎలాంటి ధాన్యం ఇవ్వొద్దని నిర్ణయం
- మిల్లింగ్ చార్జీల పెంపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్
- దొడ్డు వడ్లకు రూ.30, సన్న వడ్లకు రూ.40కి పెంపు
- ధాన్యం కొనుగోళ్లకు లైన్ క్లియర్
హైదరాబాద్, వెలుగు: వానాకాలం వడ్ల కొనుగోళ్లకు ప్రభుత్వం లైన్ క్లియర్చేసింది. ధాన్యం కొనుగోళ్లపై సబ్‌కమిటీ రూపొందించిన గైడ్‌లైన్స్‌కు ఇటీవల కేబినెట్‌ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగా వానాకాలం సీజన్ వడ్ల కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక పాలసీని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.
దీని ప్రకారం.. గతంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎగవేసిన డిఫాల్ట్మిల్లర్లకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయించేది లేదని సర్కారు తేల్చి చెప్పింది. తద్వారా అక్రమాలకు పాల్పడే మిల్లర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. గతంలో మాదిరి అవకతవకలకు తావులేకుండా వడ్ల కేటాయింపునకు ఈసారి కేటగిరీల వారీగా10 నుంచి 25శాతం బ్యాంక్ గ్యారెంటీ తప్పనిసరి చేసింది.
ప్రతి మిల్లర్ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సిందే
మిల్లర్లకు ధాన్యం కేటాయించాలంటే కచ్చితంగా బ్యాం కు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిందేనని పాలసీలో స్పష్టం చేసింది. మిల్లర్లను 4 కేటగిరీలుగా విభజించింది. గతంలో సీఎంఆర్ ఇచ్చిన విధానాన్ని బట్టి గ్యారెంటీలను సమర్పించేలా నిర్ణయం తీసుకున్నది. మొదటి కేటగిరీలో భాగంగా గతంలో సీఎంఆర్‌లో ఎలాంటి జాప్యం లేకుండా బియ్యం ఇచ్చిన మిల్లర్లకు.. వారికి అప్రూవల్ అయిన మిల్లింగ్ కెపాసిటీకి తగ్గుట్టుగా ధాన్యం మద్దతు ధర ఆధారంగా 10 శాతం బ్యాంక్ గ్యారెంటీని కానీ లేదా రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యంలో 25 శాతం విలువైన సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని షరతు పెట్టింది.
గతంలో సీఎంఆర్ పెం డింగ్‌లో ఉండి డిఫాల్టర్‌గా మారి పెనాల్టీతోసహా క్లి యర్ చేసిన మిల్లర్లు 20శాతం బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాల్సి ఉంటుంది. లేదా అప్రూవ్డ్ మిల్లింగ్ కెపాసిటీలో 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో డిఫాల్టర్‌గా ఉండి పెండింగ్ సీఎంఆర్ 100శాతం క్లియర్‌చేసి.. 25శాతం పెనాల్టీ పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టిన మిల్లర్లు పెం డింగ్‌లో ఉన్న పెనాల్టీ ధాన్యానికి 25 శాతం బ్యాంక్ గ్యా రెంటీ ఇవ్వాలి. అలాగే, మిల్లింగ్ అప్రూవ్డ్ కెపాసిటీలో 25 శాతం అదనంగా మరో బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డిఫాల్డ్ మిల్లర్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయించేది లేదని సర్కారు తేల్చి చెప్పింది.
మిల్లింగ్ చార్జీలు పెంపు
మిల్లింగ్ చార్జీలను క్వింటాల్‌కు రూ.110 నుంచి రూ.200కు పెంచాలనే మిల్లర్ల డిమాండ్‌పై సర్కారు సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం అన్ని రకాల వడ్లను మిల్లింగ్ చేయడానికి క్వింటాల్‌కు రూ.10 ఉండగా.. దొడ్డురకం వడ్లకు క్వింటాల్ కు రూ.30, సన్న రకం వడ్లకు క్వింటాల్‌కు రూ.40కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అయితే, మిల్లర్ల డిమాండ్ మేరకు మిల్లింగ్ చార్జీలను పెంచుతూనే మరో పక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన గడువులోగా ఇచ్చిన సీఎంఆర్‌కు మాత్రమే పెంచిన మిల్లింగ్ చార్జీలు వర్తిస్తాయని చెప్పింది. సీఎంఆర్ జాప్యం చేస్తే పెంచిన చార్జీలు వర్తించవని గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది.
గోదాముల్లోని ధాన్యానికి జిల్లా మేనేజర్లదే బాధ్యత
రైతుల నుంచి కొనుగోలు చేసే వడ్లు మిల్లులతోపాటు రాష్ట్ర వేర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ గోదాముల్లోనూ నిల్వ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇలా నిల్వ చేసే ధాన్యం పరిరక్షణ బాధ్యతను డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్, జిల్లా సివిల్ సప్లయ్స్ సంస్థ మేనేజర్(డీఎం)కు అప్పగించింది. వడ్లు పాడైనా, షార్టేజ్ వచ్చినా, నాణ్యత దెబ్బతిన్నా దీనంతటికీ పూర్తి బాధ్యత డీఎందేనని స్పష్టం చేసింది. గోదాముల్లో నిల్వ చేసిన వడ్లను బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన లేదా సెక్యూరిటీ డిపాజిట్ చేసిన మిల్లులకు కేటాయించాలని నిర్ణయించింది.
సన్న వడ్ల పంచాయితీ తేల్చేది ఏఈవోలే
ధాన్యం కొనుగోలు సెంటర్లలో సన్నరకం వడ్ల గుర్తింపు, ఇతర ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించే బాధ్య తలను ఏఈవోలకు సర్కారు అప్పగించింది. సన్నవడ్లపై ఏమైనా అభ్యంతరాలున్నా మిల్లర్లు ఆన్‌లైన్ ద్వారా 48 గంటల్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నది. ఆ తర్వా త 24 గంటల్లో ఏఈవోలు మిల్లర్లు లేవనెత్తిన సమస్యను పరిష్కరిస్తారని గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది..
సన్న ధాన్యం ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రతి మిల్లుకు ఒక ఏఈవోను కేటాయించింది. ఏఈవో నిర్ణయంపై మిల్లర్ల అభ్యంతరాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆర్డీవో లెవల్లో ఏడీఏ, డిప్యూటీ ఎమ్మార్వోలు , జిల్లా లెవల్లో డీఏవో, డీఎస్వోలు సన్నధాన్యం గుర్తింపుపై వచ్చే సమస్యలను పరిష్కరిస్తారని తెలిపింది.