వైట్ బాల్ క్రికెట్ హిస్టరీలోనే బట్లర్ అరుదైన రికార్డ్: కోహ్లీ, రోహిత్ సరసన చేరిన ఇంగ్లాండ్ ప్లేయర్

వైట్ బాల్ క్రికెట్ హిస్టరీలోనే బట్లర్ అరుదైన రికార్డ్: కోహ్లీ, రోహిత్ సరసన చేరిన ఇంగ్లాండ్ ప్లేయర్

బ్రిటన్: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. వైట్ బాల్ క్రికెట్ (వన్డే, టీ20) చరిత్రలోనే 350 ప్లస్ బౌండరీలు సాధించిన ఐదో ప్లేయర్‏గా రేర్ ఫీట్ నెలకొల్పాడు. ఆదివారం (అక్టోబర్ 20) క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‎తో జరిగిన టీ20లో ఒక ఫోర్ బాదడం ద్వారా బట్లర్ ఈ రికార్డ్ అందుకున్నాడు. 

ఈ మ్యాచులో బట్లర్ కొట్టిన ఏకైక ఫోర్ ఇదే కావడం గమనార్హం. తద్వారా వన్డే, టీ20.. రెండు ఫార్మాట్లలో  కలిపి 350 లేదా అంతకన్నా ఎక్కువ బౌండరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదో ప్లేయర్‎గా బట్లర్ తన పేరు లిఖించుకున్నాడు. ఈ జాబితాలో బట్లర్ కంటే రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, పాల్ స్టిర్లింగ్, బాబర్ అజామ్‌ ముందున్నారు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సోమవారం (అక్టోబర్ 20) క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‎లో కివీస్‎పై 65 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. బ్రూక్ (35 బంతుల్లో 78: 6 ఫోర్లు, 5 సిక్సర్లు), సాల్ట్ (56 బంతుల్లో 85: 11 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడారు.

 మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 18 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్‎ల సిరీస్‎లో 1-0 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది.