- సెమీఫైనల్ బెర్తుపై టీమిండియా గురి
- మధ్యాహ్నం1 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
బులవాయో: అండర్–19 వరల్డ్ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న యంగ్ ఇండియా.. హై ఓల్టేజ్ పోరుకు రెడీ అయింది. ఆదివారం జరిగే సూపర్–6 ఆఖరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిచి సెమీఫైనల్‌కు చేరుకోవడంతో పాటు ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కుర్రాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ వరల్డ్ కప్‌లో ఇండియా కుర్రాళ్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపించింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికాపై గెలిచారు. సూపర్–6 తొలి మ్యాచ్‌లోనూ జింబాబ్వేను ఓడించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దాంతో పాక్‌తో మ్యాచ్‌లోనూ టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
వైభవ్ సూర్యవంశీ (166 రన్స్), అభిగ్యాన్ కుండు (183), విహాన్ మల్హోత్రా (151) ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. వీళ్లకు తోడు కెప్టెన్ ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జ్ బ్యాట్ ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో పేసర్ హెనిల్ పటేల్, ఉదవ్ మోహన్, ఆర్.ఎస్ అంబరీష్‌పైనే ఎక్కువగా భారం ఉంది. వీళ్లందరూ సమష్టిగా చెలరేగితే ఇండియా విజయాన్ని అడ్డుకోవడం కష్టమే.
మరోవైపు పాకిస్తాన్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. సూపర్–6 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి మంచి జోరు మీదుంది. ఆసియా కప్ ఫైనల్లో 172 రన్స్ చేసిన ఓపెనర్ సమీర్ మిన్హాస్ మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు కలిసొచ్చే అంశం.
