
మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ( అక్టోబర్ 20 ) అర్థరాత్రి స్థానిక ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పతంగుల తయారీ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో పెద్ద మొత్తంలో పతంగులు స్టాక్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ కమ్మేయడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
పరిసర ప్రాంతంలోని జనం దీపావళి సంబరాల్లో మునిగిన సమయంలో ప్రమాదం జరగడంతో ఉలిక్కిపడ్డారు జనం.ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్థి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గోడౌన్ యాజమాన్యం ఫైర్ నిబంధనలు పాటించలేదని గుర్తించినట్లు తెలిపారు అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు