
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. పిల్లలు పెద్దలు అంతా ఆనందంగా పటాకులు పేల్చుతూ పండగ జరుపుకున్నారు. అయితే.. హైదరాబాద్ లో ప్రతి ఏడాదిలాగే దీపావళి ఆనందంలో విషాదాలు కూడా చోటు చేసుకున్నాయి. కంటి గాయాలతో ఆసుపత్రులకు క్యూ కట్టారు కొంతమంది జనం. దీపావళి సందర్భంగా పటాకులు పేల్చుతూ కొంతమంది ప్రమాదానికి గురయ్యారు. కంటి గాయాలతో మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు జనం.
సోమవారం ( అక్టోబర్ 20 ) రాత్రి నుంచి పటాకులు పేల్చుతూ గాయపడ్డ 47 మంది సరోజినీ ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు సిబ్బంది. గాయపడ్డవారిలో 23 మందికి మేజర్ గాయాలయ్యాయని.. క్షతగాత్రుల్లో 18 చిన్నారులు ఉన్నారని తెలిపారు సిబ్బంది. క్రాకర్స్ వచ్చి కళ్ళల్లో పడటంతో గాయాలు అయ్యాయని తెలిపారు డాక్టర్లు.
కంటి గాయాలతో ఆసుపత్రిలో చేరినవారిలో ఇద్దరికీ రెప్పలు కట్ అయ్యాయని.. అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నామని తెలిపారు డాక్టర్లు. ఆసుపత్రిలో మొత్తం 7 మంది డాక్టర్ల బృందం ఉన్నారని.. ఇద్దరు సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్, అనేస్తిషియ డాక్టర్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని కేసులు వచ్చినా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. క్రాకర్స్ కాల్చే ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.