బీహార్ రాజకీయాల్లో సంచలనం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి JMM పార్టీ ఔట్

బీహార్ రాజకీయాల్లో సంచలనం.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి JMM పార్టీ ఔట్

పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌ కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆర్జేడీ తమకు సీట్లు దక్కకుండా చేసిన రాజకీయ కుట్ర నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. 

ఈ సందర్భంగా జేఎంఎం సీనియర్ నాయకుడు సుదివ్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‎లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి జేఎంఎంకు అన్యాయం చేశాయని ఫైర్ అయ్యారు. ఇందుకుగానూ జార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో పొత్తును జేఎంఎం సమీక్షిస్తుందని తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన సమాధానం ఇస్తామని ఆయన హెచ్చరించారు. 

కాగా, బీహార్‎లో ప్రతిపక్ష మహాఘాట్ బంధన్ కూటమిలో జేఎంఎం పార్టీ భాగస్వామిగా ఉంది. అయితే.. సీట్ల పంపకాల విషయంలో మహాఘాట్ బంధన్ కూటమిలో విభేదాలు తలెత్తాయి. పొత్తులో భాగంగా జేఎంఎం అడిగిన సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ నిరాకరించాయి. సీట్ల పంపకాల చర్చలు విఫలం కావడంతో బీహార్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని జేఎంఎం పార్టీ రెండు రోజుల క్రితం ప్రకటించింది.

చకై, ధమ్‌దహా, కటోరియా, మణిహరి, జముయ్, పిర్‌పైంటి.. మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలని జేఎంఎం డిసైడ్ అయ్యింది. నామినేషన్ దాఖలకు చివరి రోజైన సోమవారం (అక్టోబర్ 20) అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జేఎంఎం పార్టీ ప్రకటించింది. బీహార్‎లో మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాల్లో నెలకొన్న విభేదాలు జార్ఖండ్‎లో తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే జార్ఖండ్‎లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా ఈ కూటమిలోనే భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ తీరుతో బీహార్‎లో సీట్ల పంపకాల్లో దెబ్బతిన్న జేఎంఎం.. జార్ఖండ్‎లో కాంగ్రెస్, ఆర్జేడీతో పొత్తును సమీక్షిస్తామని చెప్పడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.