నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి పంట పొలాల్లోకి బుధవారం ఉదయం తల్లీ పిల్ల ఎలుగుబంట్లు ప్రత్యక్షమయ్యాయి. బుధవారం ఉదయం రైతులు వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లారు. గీత కార్మికులు కల్లు గీసేందుకు తాటి చెట్లు ఎక్కగా, గ్రామ శివారులోని చెన్నకేశవ స్వామి గుట్టల సమీపం నుంచి ఎలుగుబంట్లు వస్తుండడంతో గీత కార్మికులు తమ సెల్ఫోన్లలో ఫొటోలు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, తల్లీ పిల్ల ఎలుగుబంట్ల కోసం గాలించారు.
సాయంత్రం వరకు వాటి ఆచూకీ లభించలేదు. ఎఫ్ఎస్ వో సరితా రెడ్డి, బీట్ ఆఫీసర్ సోమా యోగేశ్, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎలుగుబంట్ల ఆచూకీ కోసం రెస్య్కూ టీం రంగంలోకి దిగిందని ఎఫ్ఎస్వో చెప్పారు. ఎలుగు బంట్లకు పగలు సరిగా కనపడదని, రాత్రి వేళల్లో వాటి కళ్లు షార్ప్‌గా పని చేస్తాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రైతులెవరూ తమ పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
