- 2024లో రూ.13,388 కోట్లు, 2025లో రూ.33,574 కోట్లు కట్టిన సర్కారు
- 2020 –2023 వరకు 4 ఏండ్లలో
- బీఆర్‌ఎస్ కట్టింది రూ.25 వేల కోట్లే
- ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి వాస్తవాలు
- కాళేశ్వరం అప్పు వల్ల సంక్షేమ పథకాలపై ఎఫెక్ట్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత బీఆర్‌ఎస్ సర్కారు చేసిన అప్పు.. రాష్ట్రంపై పెనుభారంగా మారింది. దొరికినకాడల్లా అప్పులు చేసి గత ప్రభుత్వం కట్టిన ఆ ప్రాజెక్టు ఇప్పుడు అక్కరకు రాకుండా పోయింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి నెలనెలా కిస్తీల బాధ తప్పట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 నుంచి 2023 వరకు నాలుగేండ్లలో రూ.25,800 కోట్ల దాకా కాళేశ్వరం కిస్తీలు కడ్తే.. కాంగ్రెస్ వచ్చాక రెండేండ్లలో దాదాపు రూ.47 వేల కోట్ల దాకా బాకీలను వడ్డీతోసహా చెల్లించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు కట్టిన కిస్తీల వివరాలపై ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా పెట్టుకున్న దరఖాస్తుకు తాజాగా గజ్వేల్ఈఎన్సీ రిప్లై ఇచ్చారు. 2020 నుంచి 2025 వరకు కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా కట్టిన అప్పుల వివరాలను వెల్లడించారు. గత ఆరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిన కిస్తీలే రూ.72,766.16 కోట్లు ఉండడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది ఒక్క జనవరిలోనే ఆ ప్రాజెక్టు కోసం చేసిన అప్పులకు వడ్డీ కింద ఏకంగా రూ.417.34 కోట్లను చెల్లించింది. రెండేండ్లలో దాదాపు రూ.47 వేల కోట్లు కేవలం కాళేశ్వరం కిస్తీలకే పోవడంతో రైతుభరోసాలాంటి సంక్షేమ పథకాలకు నిధులును సర్దుబాటు చేయడం కాంగ్రెస్ సర్కారుకు కష్టసాధ్యంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అప్పులను తీర్చడంలో కాంగ్రెస్ సర్కారు బాధ్యతగా వ్యవహరిస్తున్నది. అందులో భాగంగానే రెండేండ్లలోనే ప్రభుత్వం రూ.46,962.82 కోట్లు చెల్లించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన దాని కన్నా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తూ భారం తగ్గించుకుంటున్నది. 2024లో రూ.13,388.71 కోట్లను చెల్లించిన కాంగ్రెస్ సర్కారు, 2025లో అంతకు రెండున్నర రెట్లు (రూ.33,574.11 కోట్లను) రీపేమెంట్చేసింది. ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పుల్లో తిరిగి కట్టిన ఎక్కువ మొత్తం ఇదే కావడం విశేషం. ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం కార్పొరేషన్‌ద్వారా దాదాపు రూ.84 వేల కోట్ల వరకు అప్పులు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), యూనియన్‌బ్యాంక్ (గతంలో ఆంధ్రా బ్యాంక్), బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)లాంటి సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టును నిర్మించింది. అది కూడా అధిక వడ్డీలకు తేవడంతో.. ప్రభుత్వానికి భారంగా పరిణమించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆ లోన్లను రీస్ట్రక్చర్ చేయించింది. అందులో భాగంగానే వేగంగా అసలును చెల్లిస్తున్నది. తద్వారా వడ్డీల భారాన్ని తగ్గించుకుంటున్నది.
పూర్తయిన ఏడాదికే లోపాలు..
కాళేశ్వరం బ్యారేజీలు పూర్తయిన తొలి ఏడాది వచ్చిన వరదలకే వాటిలోని లోపాలు బయటపడ్డాయి. 2019లో బ్యారేజీలు పూర్తికాగా.. అదే ఏడాది వచ్చిన వరదలకు తొలుత మేడిగడ్డ బ్యారేజీలో లీకేజీలు కనిపించాయి. ఏదో తాత్కాలికంగా రిపేర్లు చేశారే తప్ప.. పూర్తిస్థాయిలో పరిష్కారం చూపించలేదు. ఆ తర్వాత 2020, 2022లో వచ్చిన వరదలకు మూడు బ్యారేజీల్లోని సీసీ బ్లాకులు, ఆప్రాన్లు, రాఫ్ట్‌లు భారీగా దెబ్బతిన్నాయి. అప్పటికే డిఫెక్ట్లయబిలిటీ పీరియడ్‌లో ఉన్న నిర్మాణ సంస్థలు.. వాటి రిపేర్లను పట్టించుకోలేదు. ప్రభుత్వమూ చూసీ చూడనట్టు వ్యవహరించింది. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్‌లో మేడిగడ్డలోని ఏడో బ్లాక్‌లో రెండు పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. రిపేర్లు చేసినా నిలబడలేనంత తీవ్రతతో దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ మేడిగడ్డను నిలబెట్టాలంటే కొత్తగా ఏడో బ్లాక్‌ను నిర్మించాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చెప్పడం గమనార్హం. ఇప్పుడు ప్రభుత్వం అదే పనిలో ఉన్నది. మూడు బ్యారేజీలను పునరుద్ధరించేందుకు అక్కడ ఇప్పటికే జియోటెక్నికల్ టెస్టులను చేయిస్తున్నది. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల కోసం ‘ఆఫ్రీ’ సంస్థకు బాధ్యతలు అప్పగించింది.
కాళేశ్వరం కిస్తీల చెల్లింపు ఇలా..
ఏడాది చెల్లించిన మొత్తం (రూ.కోట్లలో)
2020 1,487.98
2021 3,364.65
2022 9,077.01
2023 11,873.70
2024 13,388.71
2025 33,574.11
ఈ ఏడాది జనవరిలో వివిధ బ్యాంకులకు కట్టిన వడ్డీ
బ్యాంకు కట్టిన వడ్డీ (రూ.కోట్లలో)
పీఎన్‌బీ 77.69
యూబీఐ 51.24
బ్యాంక్ ఆఫ్ బరోడా 15.00
పీఎఫ్‌సీ 273.41
