
ముంబై: దీపావళి పండుగ వేళ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. 350కి పైగా హిందీ చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు గోవర్ధన్ అస్రానీ కన్నుమూశారు. 84 సంవత్సరాల అస్రానీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత విషమించడంతో సోమవారం (అక్టోబర్ 20) ముంబైలో మరణించారు.
దీపావళి పండుగ పురస్కరించుకుని సోషల్ మీడియాలో నెటిజన్లకు శుభాకాంక్షలు తెలిపిన గంటల వ్యవధిలోనే అస్రానీ మరణించడం గమనార్హం. గోవర్ధన్ అస్రానీ మృతిపట్ల పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన గోవర్ధన్ అస్రానీ బాలీవుడ్ ఆల్‌టైమ్ సూపర్ హిట్ మూవీ షోలేలో జైలర్ పాత్ర ద్వారా నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత భూల్ భూలైయా, ధమాల్, బంటీ ఔర్ బబ్లి 2, ఆర్... రాజ్ కుమార్ వంటి హిట్ చిత్రాలలో కూడా ఆయన నటించి ప్రేక్షులను మెప్పించారు.
గోవర్ధన్ అస్రానీ నేపథ్యం..
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 1941, జనవరి 1న సింధీ హిందూ కుటుంబంలో జన్మించాడు గోవర్ధన్ అస్రానీ. 1960 నుంచి 1962 వరకు సాహిత్య కల్భాయ్ ఠక్కర్ వద్ద ఆయన యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం కోసం ముంబైకి మకాం మార్చాడు. ఈ క్రమంలో కిషోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీలతో అనుకోకుండా కలిసిన పరిచయం ఆయనకు సినిమాల్లో అవకాశం దక్కేలా చేసింది.
అస్రానీ హిందీ చిత్రాలతో పాటు అనేక గుజరాతీ సినిమాల్లో కూడా యాక్ట్ చేసి మెప్పించాడు. 1972 నుంచి 1984 వరకు సినిమాల్లో మెయిన్ రోల్స్ పోషించిన అస్రానీ.. 1985 నుంచి 2012 వరకు సైడ్ క్యారెక్టర్స్‌లో నటించాడు. ఆజ్ కీ తాజా ఖబర్, నమక్ హరామ్ వంటి చిత్రాలలో కలిసి పని చేస్తున్నప్పుడు ప్రేమలో పడిన నటి మంజు బన్సాల్‌ను గోవర్ధన్ అస్రానీ వివాహం చేసుకున్నారు.