
బంగారం రేటు మరింత పెరగవచ్చనే అంచనాల కారణంగా చాలామంది పెట్టుబడుల కోసం కూడా బంగారాన్ని కొంటున్నారు. దీపావళి రోజున బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై సోమవారం 170 రూపాయలు తగ్గడంతో లక్షా 30 వేల 690 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 150 రూపాయలు తగ్గి లక్షా 19 వేల 800 రూపాయలుగా ఉంది.
అక్టోబర్ 11న 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 25 వేల 80 రూపాయలు ఉండగా.. అక్టోబర్ 20న లక్షా 30 వేల 690 రూపాయలకు చేరింది. అంటే.. జస్ట్ పది రోజుల్లో 5 వేల 6 వందల 10 రూపాయలు పెరిగింది. పండుగల సీజన్ రావడానికి తోడు ధరలు విపరీతంగా పెరగడంతో బంగారం మార్కెట్లో భారీ సందడి కనిపిస్తోంది.
సరైన బంగారం కొనుగోలుకు నమ్మకం, పారదర్శకత ముఖ్యమైన అంశాలు. మీరు కొనే రిటైలర్ నగలను సరిగా వెరిఫై చేయాలి. బీఐఎస్ హాల్మార్క్, ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించే ఆరు అంకెల హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ను అందిస్తేనే తీసుకోవాలి. పూర్తి డాక్యుమెంటేషన్అడగడానికి వెనుకాడకూడదు. డీటెయిల్డ్ ఇన్వాయిస్, హామీ కార్డు, అసెస్మెంట్ రిపోర్ట్ కోరాలి.
ఇన్వాయిస్లో బంగారు రేటు, తయారీ చార్జీలు, తరుగు (వేస్టేజ్), పన్నుల గురించి ఉందో లేదో చూడాలి. వివిధ రిటైలర్ల ధరలు పోల్చి చూడటానికి ఇది సహాయపడుతుంది. రిటర్న్ లేదా బైబ్యాక్ పాలసీలను అందించే వాళ్ల దగ్గర కొనడం బెటర్. ప్రతి దానిపై హాల్మార్క్ స్టాంప్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. తిరిగి అమ్మడానికి, బీమాకు ఇది చాలా కీలకం.