- నిర్మల్ జిల్లా బాగాపూర్ సర్పంచ్‌గా పోస్టల్ ఓటుతో గెలిచిన శ్రీవేద
- మెదక్ జిల్లా చీపురు దుబ్బా తండాలో డ్రాలో సర్పంచ్‌గా గెలిచిన సునీత
- టై కావడంతో టాస్‌తో గెలిచిన సర్పంచ్‌లు
- పోస్టల్ బ్యాలెట్‌తో యువతి విజయం
- ఒక్క ఓటుతో విజయం వరించినోళ్లు మరికొందరు
- వార్డ్మెంబర్గా ఏకగ్రీవం.. సర్పంచ్‌గా ఘనవిజయం
- మామపై కోడలు విక్టరీ
- సూసైడ్ చేసుకున్న అభ్యర్థి సర్పంచ్‌గా గెలుపు
- తల్లి డెడ్ బాడీ ఇంట్లో ఉన్నా ఓటేసిన కొడుకు
నెట్వర్క్, వెలుగు : గెలుపు అంచుల దాకా వచ్చి టాస్‌లో పదవి చేజారడంతో పలువురు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పోరాడిన అభ్యర్థులు తమ ప్రత్యర్థితో సమానంగా ఓట్లు రావడంతో టెన్షన్‌కు గురయ్యారు.
ఉత్కంఠ నిండిన వాతావరణంలో అధికారులు టాస్ వేసి విజేతను ప్రకటించారు. గెలిచిన వారు సంబరాల్లో మునిగితే.. పదవి దక్కని వారు లక్ కలిసి రాలేదని వాపోతున్నారు. కేవలం ఒక్క ఓటు ఎక్కువ రావడంతో గెలిచిన అభ్యర్థులు సంబురపడగా, ఒక్క ఓటు తేడాతో ఓడిన వాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐదారు ఓట్ల తేడాతో పలువురు సర్పంచులుగా గెలిచారు.
మెదక్ జిల్లా మెదక్ మండలం చీపురు దుబ్బ తండా పంచాయతీ ఎన్నికల్లో 377 ఓట్లకు 367 ఓట్లు పోలయ్యాయి. అందులో రెండు ఓట్లు చెల్లలేదు. ఒక ఓటు నోటాకు పడింది. చెల్లిన ఓట్లలో కేతావత్ సునీత(కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్)కు 182 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీయగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అడవి లింగాలకు చెందిన మంగలి సంతోష్ సర్పంచ్‌గా టాస్ తో గెలిచారు. ఇక్కడ సంతోష్ కు, మానయ్యకు 483 ఓట్ల చొప్పు వచ్చాయి. దీంతో అధికారులు ఇద్దరి సమక్షంలో టాస్ వేశారు. సర్పంచ్ పదవి మంగలి సంతోష్‌ను వరించింది.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ బలపర్చిన సయ్యద్ సత్తార్, బీఆర్ఎస్ బలపర్చిన సయ్యద్ హఫీజ్ పోటీ పడ్డారు. ఎన్నికల్లో ఇద్దరికీ 162 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో ఇద్దరి అంగీకారంతో ఎన్నికల అధికారులు టాస్ వేయగా, సయ్యద్ సత్తార్ ను విజయం వరించింది.
వికారాబాద్ మండలం జైదుపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేశారు. నాగిరెడ్డి, మౌనిక శ్రీకాంత్‌రెడ్డికి 303 ఓట్ల చొప్పున వచ్చాయి. అధికారులు టాస్ వేయగా, మౌనిక శ్రీకాంత్‌రెడ్డిని విజయం వరించింది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లంబడి తండా(కె) సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ బలపరిచిన అభ్యర్థి భూక్యా రాంచందర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు బలపరిచిన అభ్యర్థి బానోత్ బలరామ్ కు సమాన ఓట్లు వచ్చాయి. టాస్ లో బలరామ్ ను విజయం వరించింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీర్ వెల్లి సర్పంచ్ గా జాడి కావేరి(కాంగ్రెస్)ను లక్కీ డ్రా లో విజయం వరించింది . 532 ఓట్లకు గాను, 485 ఓట్లు పొలయ్యాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చెందిరి రజనీకాంత్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జాడి కావేరికి 204 ఓట్ల చొప్పున వచ్చాయి. ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో డ్రా వేయగా కావేరి గెలిచారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ జీపీ ఎన్నికలో బత్తుల వీరస్వామి, బొల్లికొండ వెంకన్నకు 947 చొప్పున ఓట్లు రాగా, టాస్ వేసి బత్తుల వీరస్వామిని సర్పంచ్‌గా ప్రకటించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటుతో గెలుపు
హోరాహోరీ పోరులో ఇద్దరికీ సమాన ఓట్లు రాగా, అక్కడ నమోదైన ఒకే ఒక బ్యాలెట్ ఓటుతో విద్యావంతురాలైన యువతి సర్పంచ్ గా ఎన్ని కయ్యారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ పంచాయతీకి ఆదివారం పోలింగ్ జరగ్గా, ముత్యాల శ్రీవేద, ఆమె ప్రత్యర్థి అర్ష స్వాతికి 180 చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత అధికారులు పోలైన పోస్టల్ బ్యాలెట్ శ్రీవేదకు రావడంతో ఆమె గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
మూడు సార్లు లెక్కించినా ..
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంటలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన తిరుపతమ్మకు 605 ఓట్లు రాగా, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన పద్మమ్మకు 604 ఓట్లు వచ్చాయి. దీంతో పద్మమ్మపై తిరుపతమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుదారులు రీ కౌంటింగ్ చేయాలని కోరగా, ఎన్నికల సిబ్బంది మూడు సార్లు రీ కౌంటింగ్ చేశారు. మూడు సార్లు కూడా ఒక్క ఓటు మెజార్టీనే వచ్చింది.
రీ కౌంటింగ్‌లో ..
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో శేఖర్, కాంగ్రెస్ రెబల్‌గా భీమన్న గౌడ్ పోటీ చేశారు. వీరిద్దరికీ మొదట 280 చొప్పున ఓట్లు వచ్చాయి. ఆఫీసర్లు టైగా ప్రకటించి, టాస్ వేసి విజేతను ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఇద్దరు క్యాండిడేట్లు ఇందుకు ఒప్పుకోలేదు. రీ కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. రీకౌంటింగ్‌లో భీమన్నకు ఒక ఓటు ఎక్కువ రావడంతో ఆయన గెలుపొందారు.
సర్పంచ్ అభ్యర్థి భర్త హల్ చల్
మెదక్, వెలుగు: మెదక్ జిల్లా నార్సింగి మండలకేంద్రంలో సర్పంచ్ క్యాండిడేట్ భర్త శంకర్ నాయక్ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఆయన భార్య నర్సంపల్లి పెద్ద తండా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. కాగా, ప్రత్యర్థులు ఓటుకు రూ.2 వేలు పంచుతున్నారంటూ శంకర్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. గతంలో తాను సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాయని, ఉప సర్పంచ్‌గా గ్రామాన్ని డెవలప్ చేశానని చెప్పాడు. అతడికి పోలీసులు నచ్చజెప్పి కిందకు దించారు.
ఒక్క ఓటుతో వరించిన విజయం
- వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన గొల్ల రమాదేవి సమీప అభ్యర్థి మౌనికపై ఒక్క ఓటుతో గెలుపొందారు.
- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల సర్పంచ్‌గా నక్క బుచ్చిరెడ్డి ఒక్క ఓటుతో ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి కాంతారెడ్డిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
- నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం ధన్ సింగ్ తండాలో ఒక్క ఓటుతో ధనావత్ ధూప్ సింగ్ ఒక్క ఓటుతో మెగావత్ భాస్కర్ నాయక్ పై గెలుపొందాడు.
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామ సర్పంచ్ గా వడ్లకొండ వెంకటేశ్ ఎన్నికయ్యాడు. ప్రత్యర్థి వేగుర్ల ఎల్లయ్యకు 448 ఓట్లు రాగా, వెంకటేశ్‌కు 449 ఓట్లు వచ్చాయి.
- వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్ గా కొంగర మల్లమ్మ గెలిచింది. ఎస్సీ అభ్యర్థులు లేకపోవడంతో ఏకగ్రీవం అవుతుందని భావించినప్పటికీ, అనూహ్యంగా రాయపురం నవ్య శ్రీ నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఆదివారం జరిగిన పోలింగ్‌లో1,451 ఓట్లు పోలవగా, మల్లమ్మకు 705, నవ్యశ్రీకి 704 ఓట్లు పోలయ్యాయి. మల్లమ్మ ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొంది హ్యాట్రిక్ సాధించగా, స్థానికులు సంబరాలు చేసుకున్నారు.
- ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్యపల్లిలో జాటోత్ గణేశ్ఒక ఓటుతో గెలిచాడు. మొదట రెండు ఓట్లు ఆధిక్యం రావడంతో మరో అభ్యర్థి జర్పుల హేమూ నాయక్ రీకౌంటింగ్ కోసం ఆందోళన చేశారు. రీకౌంటింగ్ చేసిన అనంతరం ఒక ఓటు ఆధిక్యంతో గణేశ్గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
