
- వైభవంగా బోనాల సమర్పణ
- బంగారు బోనం సమర్పించిన జోగిని నిషా క్రాంతి
హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఊరేగింపు బుధవారం కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి రథయాత్రను గవర్నర్ సతీమణి సుధా దేవ్ వర్మ, కలెక్టర్ హరిచందన, పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. రథం ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథయాత్ర దేవాలయం నుంచి అమీర్ పేట కెప్టెన్ కుక్ రూట్ నుంచి ఎస్సార్ నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, బతుకమ్మ చౌరస్తా నుంచి తిరిగి ఆలయానికి చేరుకుంది.
రథోత్సవానికి ముందు భక్తులు, శివసత్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డీసీపీ విజయ్ కుమార్, ఆర్డీఓ సాయిరాం, ఈఓ మహేందర్, తహసీల్దార్ పద్మ సుందరి తదితరులు పాల్గొన్నారు.
మూడో బోనం... బల్కం పేట ఎల్లమ్మకు
రథోత్సవం సందర్భంగా అమ్మవారికి జోగిని నిషా క్రాంతి బంగారు బోనం సమర్పించారు. సప్త మాతలకు సప్త బోనాల సమర్పణలో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు రాఘవేందర్ ఆధ్వర్యంలో బంగారు బోనాన్ని సమర్పించినట్టు జోగిని నిషా క్రాంతి తెలిపారు. పదేండ్లుగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పిస్తున్నామని, అందులో భాగంగా మొదటి బోనాన్ని గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి, రెండో బోనం విజయవాడ దుర్గమ్మకు సమర్పించామని, మూడో బోనాన్ని బల్కం పేట ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తున్నట్లు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు
గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు.