కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జాతరలు.. రథోత్సవాలు

కరీంనగర్  ఉమ్మడి జిల్లాలోని  జాతరలు.. రథోత్సవాలు

కోనరావుపేట, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు మండలకేంద్రాల్లోని ఆలయాల్లో శుక్రవారం జాతరలు... రథోత్సవాలు ఘనంగా జరిగాయి. వేములవాడ రాజన్న అనుబంధ ఆలయం కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయ ఆవరణలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం చివరి ఘట్టం రథోత్సవం అత్యంత రమణీయంగా సాగగా.. రాములగుట్ట భక్తజనంతో పులకించిపోయింది. 

జూలపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్‌‌‌‌లో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం శుక్రవారం ఉదయం భక్తుల ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరిగింది. జాతర ప్రాంగణంలో నరసింహస్వామి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వేర్వేరుగా దేవతామూర్తులను దర్శించుకున్నారు. 

రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్​మండలం తాట్లవాయి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాములోరి జాతర రథోత్సవంతో ముగిసింది. గ్రామ సమీపంలోని గుట్టపై ఉన్న చారిత్రక రామాలయంలో భక్తులు పూజలు నిర్వహించి గుట్ట కింద జరిగిన రథోత్సవంలో పాల్గొన్నారు.