ఓయూలో వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం

ఓయూలో వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం

ఓయూ/సికింద్రాబాద్, వెలుగు: ఉద్యమంలో  ఓయూ స్టూడెంట్ల పాత్ర చాలా కీలకమైందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రమంతా జరిగిన ఉద్యమం ఒక ఎత్తైతే.. ఓయూలో జరిగిన ఉద్యమంలో మరొక ఎత్తన్నారు. ఉద్యమంలో అందరి దృష్టి ఓయూపైనే ఉండేదని, ఇక్కడ ఏం జరుగుతుందోనని కేసీఆర్ మానిటర్ చేసేవారన్నారు. ఓయూలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వివేక్​ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఉద్యమాన్ని ఎంతో మంది హేళన చేశారు. పోలీసులు ఇబ్బంది పెట్టారు. అయినా వాటిని ఎదుర్కొని ఉద్యమం చేశాం. తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్న సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ఉద్యమంలో మా నాన్న కాకా వెంకటస్వామి పోరాటం చాలా పెద్దది. రాష్ట్రాన్ని చూసే చనిపోతానని ఆయన చెప్పేవారు”అని వివేక్‌‌ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతో కాకా వెంకటస్వామి అంబేద్కర్ కాలేజీని స్థాపించారని, ఆయన ఆదర్శాలకు అనుగుణంగానే పేద విద్యార్థులకు బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు. అంబేద్కర్ కాలేజీలో 2 లక్షల మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని, తమ కాలేజీ నుంచి ఈసారి ఇంటర్‌‌‌‌లో 4 స్టేట్ ర్యాంకులు వచ్చాయని, లా కోర్సుల్లోనూ యూనివర్సిటీ స్థాయిలో టాపర్స్‌‌గా నిలిచారన్నారు. 

ఈడీ దాడులకు భయపడ..

తాను కష్టపడి, నిజాయితీగా సంపాదించి పైకొచ్చానని, ఈడీ దాడులకు భయపడనని వివేక్ అన్నారు. తన కంపెనీలపై ఈడీ ఎన్నిసార్లు దాడులు చేసినా అక్కడ ఏమీ దొరకదని, చట్ట ప్రకారమే తన కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్‌‌లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎం కాకముందు ఎన్నో హామీలిచ్చారని, తర్వాత మర్చిపోయారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులను రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వని కేసీఆర్.. తన ఫ్యామిలీకి మాత్రం పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌‌‌‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అవినీతి అక్రమాలకు తెరలేపారని మండిపడ్డారు. ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే అవినీతి సీఎంకు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పి, ప్రజా పాలన తెచ్చారన్నారు. మొదటి రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసిందని, త్వరలో మిగతా వాటిని కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కూతురు వెన్నెల, టీజేఏసీ నాయకులు పాల్గొన్నారు. 

కాంట్రాక్ట్‌‌ లెక్చరర్లకు 7వ పీఆర్సీ ఇవ్వండి..

రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా 7వ పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యను అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు బుధవారం ఓయూలో కలిసి వినతి పత్రం అందజేశారు. 

ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ జేఏసీ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివేక్​మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో ఓయూ స్టూడెంట్లు తెగించి కొట్లాడారన్నారు. రాష్ట్రమంతా జరిగిన ఉద్యమం ఒక ఎత్తయితే.. ఓయూలో జరిగిన పోరాటం మరొక ఎత్తన్నారు.