చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించండి : హైకోర్టు

చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించండి : హైకోర్టు
  •     జీహెచ్‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని అన్ని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించి, దోమల నివారణకు ఫాగింగ్​చేపట్టాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. హైదరాబాద్‌‌ సరూర్‌‌నగర్‌‌ చెరువులో గుర్రపు డెక్క సమస్యపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని సవాల్​ చేస్తూ సైదాబాద్‌‌కు చెందిన డి.కీర్తికిరణ్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. దీనిపై జస్టిస్‌‌ ఎన్‌‌.వి.శ్రవణ్‌‌ కుమార్‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దోమల బెడదపై ఎల్బీనగర్​ఎమ్మెల్యే సుధీర్‌‌రెడ్డి అసెంబ్లీ వేదికగా నిరసన తెలిపారన్నారు. 

సంబంధిత ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి.. ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం కూల్చివేతలకే పరిమితం కాకుండా చెరువులను శుభ్రం చేయించే బాధ్యత కూడా హైడ్రాపై ఉందన్నారు. సరూర్‌‌నగర్‌‌ చెరువులో గుర్రపుడెక్క తొలగింపు చర్యలపై నివేదిక ఇవ్వాలని జీహెచ్‌‌ఎంసీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.