సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి కేసులో గ్రేటర్ నోయిడా సొసైటీ బిల్డర్ అరెస్ట్

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి కేసులో గ్రేటర్ నోయిడా సొసైటీ బిల్డర్ అరెస్ట్

లక్నో: గ్రేటర్ నోయిడా టెకీ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎంజె విష్ టౌన్ సొసైటీ బిల్డర్ అభయ్ కుమార్‌ను మంగళవారం (జనవరి 20) పోలీసులు అరెస్టు చేశారు. నిర్లక్ష్యం కారణంగా జరిగిన నేరపూరిత హత్యగా ఆరోపిస్తూ బిల్డర్ అభయ్ కుమార్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఎంజె విష్‌టౌన్ సొసైటి గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. గ్రేటర్ నోయిడాలో ఈ కంపెనీలు పలు ప్రాజెక్టులు చేపట్టింది. 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా నిర్మాణంలో ఉన్న భవనం బేస్మెంట్ కోసం తవ్విన గొయ్యిలో కారుతో పాటు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ చేపట్టింది కూడా ఎంజె విష్‌టౌన్ సొసైటినే. దీంతో సంస్థ అధిపతి బిల్డర్ అభయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో కారు నీటి గుంతలో పడటంతో సాఫ్ట్ వేర్ మృతి చెందిన విషయం తెలిసిందే. సెక్టార్ 150లో జరిగిన ఈ ప్రమాదంలో 27ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా చనిపోయాడు. అయితే గుంతలో పడ్డ తన కొడుకును రక్షించేందుకు రెస్క్యూ టీం నిరాకరించిందని చనిపోయిన మెహతా పేరెంట్స్ ఆరోపించడం ఆందోళన రేకెత్తించింది. గుంతలో చల్లటి నీళ్లు ఉన్నాయని.. అంత చల్లని నీటిలోకి మేం దిగలేమంటూ తన కొడుకును బయటికి తీసేందుకు రెస్క్యూ టీం ఆలస్యం చేసింద ఆరోపించారు.

 దీంతో ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. సీఎం ఆదేశాల మేరకు మీరట్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. మీరట్ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG), పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సిట్‎ను ఆదేశించారు సీఎం.