
- గ్రేటర్లో రేషన్ కార్డులు ఆలస్యం
- పంపిణీకి మరో మూడు రోజుల టైమ్
- గైడ్‌లైన్స్ రాలేదన్న డీఎస్వో
- సర్కిళ్లవారీగానా, నియోజకవర్గాల వారీగానా తేలలేదని ప్రకటన
- ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల పంపిణీ మొదలైతే నగరంలో మరో మూడు రోజులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా, సీఎం రేవంత్‌రెడ్డి తుంగతుర్తిలో ప్రారంభించారు. దీంతో సోమవారమే హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని అంతా భావించారు.
కొద్దిరోజుల ముందు కూడా 14వ తేదీన కార్డుల పంపిణీ ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటన కూడా విడుదల చేయడంతో సోమవారం చాలా మంది లబ్ధిదారులు సివిల్సప్లయీస్సర్కిల్ఆఫీసులకు వచ్చి వాకబు చేశారు.
అయితే, ఇప్పటివరకూ గుర్తించిన అర్హులకు సంబంధించి మంజూరు పత్రాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ కమిషనరేట్‌నుంచి కార్డుల పంపిణీకి గైడ్లైన్స్రాని కారణంగా ఇవ్వలేకపోతున్నామన్నారు. కార్డులు నేరుగా సర్కిల్ఆఫీసుల్లో పంపిణీ చేయాలా? లేక నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇవ్వాలా అన్నదానిపై ఆలోచన చేస్తున్నామన్నారు.
రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
తాము కార్డులిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, కానీ, ప్రభుత్వం నుంచి స్పష్టత రాని కారణంగా ఇవ్వలేకపోతున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్తెలిపారు. సర్కారు ఆదేశాల మేరకు రెండు, మూడు రోజుల్లో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని ప్రకటించారు. ఈసారి 23,084 కొత్త కార్డులు, మరో 18,500 మార్పులు చేర్పులు చేసిన కార్డులు ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
మీ సేవ దరఖాస్తులే ప్రామాణికం
రోజూ వందల సంఖ్యలో కొత్త దరఖాస్తులు వస్తున్నాయని, కొందరు మీసేవ ద్వారా, మరి కొందరు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారని, కానీ, మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుంటున్నట్టు డీఎస్వో తెలిపారు. ఇప్పటికే 2.5 లక్షల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు చేసిన వారే మళ్లీ మళ్లీ చేస్తుండడంతో వడపోత వల్ల ఆలస్యమవుతోందన్నారు. మళ్లీ అర్హులను గుర్తించడం పెద్ద సమస్యగా మారిందన్నారు.