తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లనిచ్చిన ‘గ్రీన్ కో’

తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లనిచ్చిన ‘గ్రీన్ కో’

రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత పెరిగింది. దాంతో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కాగా.. తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచేందుకు ముందుకు వచ్చి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించినందుకు గ్రీన్ కో సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో కరోనా కట్టడికి ఎలాంటి నిధుల కొరత లేదని మంత్రి అన్నారు. అయితే ఇప్పుడు ఎంతో అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సెంట్రేటర్లను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.