సునామీలో మిస్సయిన భార్య కోసం పదేళ్లుగా వెతుకుతున్న భర్త

సునామీలో మిస్సయిన భార్య కోసం పదేళ్లుగా వెతుకుతున్న భర్త


టోక్యో: జపాన్ను కుదిపేసిన సునామీ ఘటనకు పదేళ్లు గడిచినయ్.. అప్పటి విధ్వంసంలో వేలాదిమంది గల్లంతయ్యారు. అందులో కొందరి శవాలు దొరకగా.. చాలామంది  ఆచూకీ దొరకలేదు. ఇటు జాడ తెలియక.. శవం కూడా దొరకని వారి సంబంధీకుల బాధ వర్ణనాతీతం. ఇలా మిస్సయిన వాళ్ల కుటుంబ సభ్యులలో కొంతమంది తేరుకోగా.. ఓ  వ్యక్తి మాత్రం తన భార్య కోసం ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు. ఓవైపు వయసు పైబడుతున్నా వెరవకుండా ప్రత్యేకంగా డైవింగ్ నేర్చుకుని, లైసెన్స్ తీసుకుని మరీ  సముద్రంలో గాలిస్తున్నాడు. భార్య అవశేషాలన్నా కనిపించకపోతాయా అని వారం వారం సముద్రంలో డైవింగ్ చేస్తున్నాడు. జపాన్లోని ఒనగవా టౌన్కు చెందిన యసువో  టకమత్సుకు ఇప్పుడు 64 ఏళ్లు.. సునామీ సృష్టించిన విధ్వంసానికి ఇల్లు వాకిలితో పాటు భార్యను కూడా కోల్పోయిన బాధితుడు. కాసేపట్లో సునామీ  విరుచుకుపడుతుందనగా.. యసువోకు ఆయన భార్య మెసేజ్ పెట్టింది. ‘నువ్వు ఎలా ఉన్నావ్? నేను ఇంటికి వెళదామనుకుంటున్నా’ అనే మెసేజ్ అందుకున్న  కాసేపటికే ఒనగవా టౌన్ ను సునామీ ముంచెత్తింది. లక్కీగా తను ప్రమాదం నుంచి బయటపడ్డా.. భార్య మాత్రం కనిపించకుండా పోయింది. రెండేళ్ల పాటు టౌన్తో పాటు  చుట్టుపక్కల ప్రాంతాలలో తిరుగుతూ భార్య కోసం వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో సముద్రం అడుగున వెతకాలని నిర్ణయించుకుని డైవింగ్ నేర్చుకున్నాడు.  పదేళ్లు గడిచినా ఇప్పటికీ తన భార్య అవశేషాలు దొరకలేదని యసువో వాపోతున్నాడు. తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకూ భార్య కోసం వెతుకుతూనే ఉంటానని యసువో   మీడియాకు చెప్పాడు. ఇంటికి వెళ్లాలన్నది తన భార్య కోరిక అని, కనీసం తన డెడ్ బాడీనైనా ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తానని యసువో వివరించాడు.