జులై 10 నాటికి గృహలక్ష్మి పోర్టల్, యాప్

జులై 10 నాటికి గృహలక్ష్మి పోర్టల్, యాప్

హైదరాబాద్, వెలుగు:  సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం స్కీమ్ కు సంబంధించి పోర్టల్, యాప్ రెడీ చేసే పనిని సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) అధికారులు ప్రారంభించారు. 100 శాతం రాయితీతో  సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల సాయంపై ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  పారదర్శకత కోసం స్కీమ్ ను మొత్తం ఆన్​లైన్​లోనే అమలు చేయాలని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో సీజీజీ అధికారులు స్కీమ్ అమలుకు సంబంధించి పోర్టల్​ను, ఆన్ లైన్ యాప్ ను రెడీ చేసే పనిలో మునిగిపోయారు. 

వచ్చే నెల 10వ తేదీ నాటికి యాప్, పోర్టల్​ను సీజీజీ రెడీ చేసి ప్రభుత్వానికి అందచేయనున్నట్లు తెలుస్తున్నది. సొంత జాగా దగ్గర మహిళ ఫొటో దిగడం, ఆన్ లైన్ జాగా, ఫొటో, బ్యాంక్ ఖాతా నంబర్, ఇతర అన్ని వివరాలను పోర్టల్, యాప్ లో అప్ లోడ్ చేయాలి. జాగాను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, అర్బన్ ఏరియాల్లో మున్సిపల్, కార్పొరేషన్​ అధికారులు, చెక్ చేసి అన్ని వివరాలను నమోదు చేయాలి.