గ్రూప్​2 వాయిదా వేయాలె..  రౌండ్​ టేబుల్​ సమావేశంలో వక్తల డిమాండ్​ 

గ్రూప్​2 వాయిదా వేయాలె..  రౌండ్​ టేబుల్​ సమావేశంలో వక్తల డిమాండ్​ 

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​-2 ఎగ్జామ్​ను వాయిదా వేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురుకులాలు, జేఎల్‌, పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ మధ్య గ్రూప్ 2 పరీక్ష పెట్టడం కరెక్ట్ ​కాదన్నారు. గ్రూప్ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి టీజేఎస్​ అధ్యక్షుడు కోందండరాం, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రియాజ్‌, టీఎస్‌పీఎస్సీ మాజీ మెంబర్‌ ‌విఠల్‌ పాల్గొన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. అసమర్థుడు కుర్చీలో కూర్చోవడం వల్లే రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు  ఇబ్బందులు పడుతున్నరని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల‌ లీకేజీలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కాబట్టే వారిని పట్టుకోవడంలేదని ఆరోపించారు.  స్టేట్​లో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఫైర్​ అయ్యారు.  

నోటిఫికేషన్‌ ఇచ్చిన వాటినైనా సక్రమంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు. లేకుంటే ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విఠల్‌ మాట్లాడుతూ..  టీఎస్‌పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, ప్రభుత్వ ఆధీనంలో ఉండి వారి డైరెక్షన్‌లో పని చేయొద్దని కోరారు. ఎలక్షన్లు వస్తున్నాయని 80 వేల ఉద్యోగాలకు హడావిడిగా నోటిఫికేషన్లు రిలీజ్‌ చేశారని, అందుకే ఈ గందరగోళం ఏర్పడుతున్నదన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రియాజ్‌ మాట్లాడుతూ.. ఏ దేశంలో కూడా మూడు నాలుగు ఎగ్జామ్స్​కు సంబంధించిన షెడ్యూలు ఒకేరోజు  ప్రకటించలేదన్నారు. పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. 5 రూపాలయ భోజనం చేస్తూ చదువుకుంటున్నామని, ఇది కాలేజీ పరీక్ష కాదని, మా జీవితాలు మార్చే ఎగ్జామ్‌ అని అన్నారు.

ఓయూలో విద్యార్థి  సంఘాల నిరసన

ఓయూ: గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని అంబేద్కర్ లైబ్రరీ ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. పేపర్ లీకేజీ వల్ల రాసిన పరీక్షలను రద్దు చేసి.. కొన్ని రోజులకే తిరిగి పరీక్షల తేదీలు ప్రకటించడంతో అభ్యర్థులు సరిగా ప్రిపేర్ ​కాలేకపోయారన్నారు.