గ్రూప్ 4 ఎగ్జామ్ కు సర్వం సిద్ధం

గ్రూప్ 4 ఎగ్జామ్ కు సర్వం సిద్ధం

ఇయ్యాల్నే గ్రూప్ 4 ఎగ్జామ్
15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్
8,180 పోస్టులకు 9.51 లక్షల మంది అప్లై
2,876 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థుల వేలిముద్ర సేకరణ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. 8,180 పోస్టుల కోసం 9,51,321 మంది ఎగ్జామ్ రాయనున్నారు. మొత్తం 2,876 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్​లోకి అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. పరీక్ష ప్రారంభమయ్యే 15 నిమిషాల ముందే గేట్ మూసివేస్తామని వెల్లడించారు. తర్వాత ఎట్టిపరిస్థితుల్లో సెంటర్​లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికం

9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం సాయంత్రం నాటికి 9,01,051 మంది హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకున్నారు.  అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 98,972 మంది, మేడ్చల్ జిల్లాలో 90,220 మంది, హైదరాబాద్​లో 59,599 మంది, కరీంనగర్​లో 54,019 మంది, నల్గొండలో 53,208 మంది అటెండ్ కానుండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 3,988 మంది, నారాయణపేటలో 7,325 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 7,482 మంది హాజరుకానున్నారు. 

40 వేల మంది ఇన్విజిలేటర్లు

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సుమారు 50 వేల మంది సిబ్బందిని అధికారులు నియమించారు. వీరిలో 40 వేల మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు కచ్చితంగా ఏదో ఒక ఫొటో ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. బ్లూ లేదా బ్లాక్ పెన్​తోనే ఓఎంఆర్ షీట్​లో బబ్లింగ్ చేయాలని తెలిపారు. దానిపై వైట్నర్, ఏరేజర్ వాడొద్దన్నారు. టైమ్ తెలియజేసేందుకు ప్రతి అరగంటకోసారి బెల్ మోగిస్తామని వివరించారు. చివరి ఐదు నిమిషాల టైమ్​లో వార్నింగ్ బెల్ కొడ్తామని తెలిపారు. ఎగ్జామ్ అయిపోయాక అభ్యర్థులందరూ ఓఎంఆర్ షీట్ అప్పజెప్పాలని, తర్వాత ఎడమ చేతి బొటన వేలు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలని సూచించారు.

గ్రూప్‑3లో మరో 13 పోస్టులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్–3 పోస్టుల సంఖ్య పెరిగింది. ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ విభాగంలో 13 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయనున్నట్టు టీఎస్​పీఎస్సీ  తెలిపింది. ఈ మేరకు టీఎస్పీఎస్​సీ సెక్రటరీ అనితారాంచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్ 29న టీఎస్​పీఎస్సీ 1,363 పోస్టులతో గ్రూప్–3 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ పోస్టులకు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు.  ఫిబ్రవరిలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పెంచారు. దీంతో ఆ పోస్టుల సంఖ్య 1,375కు చేరింది. తాజాగా మరో 13 పోస్టులు యాడ్ కావడంతో  గ్రూప్–3 ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య 1,388కి చేరింది. కొత్తగా భర్తీ చేసే 13 పోస్టుల్లో  ఏడు మహిళలకు, ఆరు పురుషులకు కేటాయించారు.