
కొనసాగుతున్న గ్రూప్ 4 ఎగ్జామ్
15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్
8,180 పోస్టులకు 9.51 లక్షల మంది అప్లై
2,876 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థుల వేలిముద్ర సేకరణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం (జులై 1న) గ్రూప్ 4 పరీక్ష కొనసాగుతోంది. 8,180 పోస్టుల కోసం 9,51,321 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 2,876 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు.
గ్రూప్ 4 పరీక్షకు కఠిన నిబంధనలు
గ్రూప్ 4 పరీక్ష నిర్వహణకు కఠిన నిబంధనలు విధించారు అధికారులు. ఎలక్ట్రానిక్ పరికరాలతో, బంగారు ఆభరణాలు ధరించి ఎగ్జామ్ సెంటర్లకు వచ్చే అభ్యర్థులను లోపలికి నిరాకరించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద అందుబాటులో వైద్య సిబ్బంది, అశ, ఏఎన్ఎంలు సిద్ధంగా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికం
9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. శుక్రవారం సాయంత్రం నాటికి 9,01,051 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 98,972 మంది, మేడ్చల్ జిల్లాలో 90,220 మంది, హైదరాబాద్లో 59,599 మంది, కరీంనగర్లో 54,019 మంది, నల్గొండలో 53,208 మంది అటెండ్ కానుండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 3,988 మంది, నారాయణపేటలో 7,325 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 7,482 మంది హాజరుకానున్నారు.
40 వేల మంది ఇన్విజిలేటర్లు
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు సుమారు 50 వేల మంది సిబ్బందిని అధికారులు నియమించారు. వీరిలో 40 వేల మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు కచ్చితంగా ఏదో ఒక ఫొటో ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. బ్లూ లేదా బ్లాక్ పెన్తోనే ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాలని తెలిపారు. దానిపై వైట్నర్, ఏరేజర్ వాడొద్దన్నారు. టైమ్ తెలియజేసేందుకు ప్రతి అరగంటకోసారి బెల్ మోగిస్తామని వివరించారు. చివరి ఐదు నిమిషాల టైమ్లో వార్నింగ్ బెల్ కొడ్తామని తెలిపారు. ఎగ్జామ్ అయిపోయాక అభ్యర్థులందరూ ఓఎంఆర్ షీట్ అప్పజెప్పాలని, తర్వాత ఎడమ చేతి బొటన వేలు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలని సూచించారు.
గ్రూప్‑3లో మరో 13 పోస్టులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో గ్రూప్–3 పోస్టుల సంఖ్య పెరిగింది. ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ విభాగంలో 13 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితారాంచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ 1,363 పోస్టులతో గ్రూప్–3 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ పోస్టులకు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 12 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పెంచారు. దీంతో ఆ పోస్టుల సంఖ్య 1,375కు చేరింది. తాజాగా మరో 13 పోస్టులు యాడ్ కావడంతో గ్రూప్–3 ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య 1,388కి చేరింది. కొత్తగా భర్తీ చేసే 13 పోస్టుల్లో ఏడు మహిళలకు, ఆరు పురుషులకు కేటాయించారు.