కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో గ్రూపుల గొడవ

కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో గ్రూపుల గొడవ
  •      ఆరోపణలు.. ప్రత్యారోపణలతో గందరగోళం
  •      వారం గడుస్తున్నా దొరకని ఎన్వీఆర్ సిస్టమ్ ను ధ్వంసం చేసిన వ్యక్తులు 
  •      రెండు రోజుల్లో ముగియనున్న పాలకవర్గం గడువు 
  •      అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భక్తుల విజ్ఞప్తి

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో గ్రూపుల గొడవ తారస్థాయికి చేరుకుంది. ఆలయ అధికారులు,  పాలక మండలి మధ్య ఇంత వరకు అంతర్గతంగా సాగిన కుమ్ములాటలు ఇప్పుడు  బజారున పడ్డాయి. మరో రెండు రోజుల్లో ఆలయ పాలక వర్గం గడువు ముగియనుంది. ఈక్రమంలో  ప్రసాద విక్రయాల్లో అవకతవకలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు, టెండర్లు లేకుండానే  ఇనుప సామగ్రి విక్రయాలు.. ఇలా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని, ఆలయ పాలనా వ్యవహారాల్లో పర్యవేక్షణ లేక అటు  ఉద్యోగులు, ఇటు పాలక మండలి సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.  

దొరకని ఇంటి దొంగలు

ఇటీవల కొందరు వాలంటీర్లు ఆలయంలో ఔట్​సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలపై ఈవోను నిలదీశారు.   జాతర టైమ్​లో 62 మంది కార్మికులు పని  చేస్తారు. జాతర తర్వాత వారిలో సగం మందికి ఒక నెల , మిగిలిన  వారికి మరో నెల పని కల్పిస్తున్నారు. అయితే వారందరూ తమను ఏడాదంతా పనిలో పెట్టుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రాజగోపురం ముందు ధర్నా నిర్వహించారు. ఈ రెండు సంఘటనలకు ఆలయంలో పనిచేస్తున్న ఒక అధికారే కారణమని ఒక వర్గం భావించింది.

ఆందోళనకు  ముందు వాలంటీర్లు, పారిశుధ్య కార్మికులు ఆలయంలో  సదరు అధికారితో సమావేశమయ్యారనే అనుమానంతో సీసీ కెమెరాల ఫుటేజ్ లు పరిశీలించాలని ఆ వర్గం నిర్ణయించింది. ఈ క్రమంలో సీసీ కెమెరాలకు సంబంధించిన ఎన్వీఆర్ సిస్టమ్ ధ్వంసం చేసినట్టు బయట పడింది. దీంతో ఆలయంలో 32 సీసీ కెమెరాలు రెండు రోజుల పాటు పనిచేయకుండా పోయాయి. ఆలయంలో పనిచేసే సిబ్బంది దీనికి కారణమని  భావించ విచారణ జరిపి వారం గడుస్తున్నా వారిని గుర్తించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటీ ప్రగతి కనిపించలేదు.

పులిహోర విక్రయాల్లో గోల్​మాల్

ఆలయానికి సంబంధించి పులిహోర ప్రసాద విక్రయాల్లో కూడా అక్రమాలు జరిగినట్టు  తేలింది. దాదాపు ఆరు వేల పులిహోర ప్యాకెట్లుకు సంబంధించి  దాదాపు రూ.1.25 లక్షలు గోల్ మాల్ జరిగినట్టు తెలిసి కింది స్థాయి సిబ్బందికి మెమో జారీ చేశారు. ఇటీవల జరిగిన ఒక ర్యాలీకి ఆలయం నుంచే 1500  పులిహోర ప్యాకెట్లు సప్లయ్ చేసినట్లు తెలిసింది. అలాగే ఆలయానికి సంబంధించిన ఓ కార్యక్రమం సందర్భంగా నాలుగు వేల ప్యాకెట్లతో పాటు మరో 700 ప్యాకెట్లు వీఐపీలకు ఇచ్చామని పేర్కొంటున్నా వాటి వివరాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పులిహోర ప్యాకెట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలు రావడంతో  1500 ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు ఇటీవలే చెల్లించినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో పాలకవర్గం గడువు ముగుస్తున్న సమయంలో ఇప్పటి వరకు సాగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ పాత బుకింగ్ కార్యాలయ భవనాన్ని కూల్చివేసినప్పుడు కొందరు పాత ఇనుప సామగ్రిని కూడా ఎలాంటీ నుమతి లేకుండానే అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా వరుసగా​జరుగుతున్న అవకతవకలు, గ్రూపుల లొల్లితో  ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.