ఆలేరు టీఆర్ఎస్​లో రచ్చ

ఆలేరు టీఆర్ఎస్​లో రచ్చ

యాదాద్రి, తుర్కపల్లి, వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు రోడ్డెక్కాయి. తుర్కపల్లి అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా జరిగిన ఘర్షణలో డీసీసీబీ చైర్మన్​గొంగిడి మహేందర్​రెడ్డిపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్​ చేశారు. అనంతరం రెండు వర్గాలకు చెందినవారు ఆదివారం పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. పార్టీ నుంచి ఐదుగురిని సస్పెండ్​ చేశామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రకటించారు. మనసులో ఏదో పెట్టుకొని తమను సస్పెండ్​చేశారని, ఈ విషయంలో పార్టీ అధిష్టానాన్ని కలుస్తా అంటూ అసమ్మతి నేత, ఆలేరు మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​పడాల శ్రీనివాస్​ప్రకటించారు. 
నలుగురి అరెస్ట్​
ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల టీఆర్ఎస్​ అధ్యక్ష పదవి ఎన్నికపై ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై డీసీసీబీ చైర్మన్ ​గొంగిడి మహేందర్​రెడ్డి వర్గానికి చెందిన తుర్కపల్లి ఎంపీపీ భూక్యా సుశీల పోలీసులకు శనివారం రాత్రే ఫిర్యాదు చేశారు. మీటింగ్​లో గొడవ సృష్టించి.. అందరినీ దూషించారని పేర్కొంటూ పిటీషన్​ఇచ్చారు. దీంతో ఆదివారం తెల్లవారుజామునే పడాల పెద్ద శ్రీనివాస్, నరేశ్, అనిల్, కరుణాకర్​ను అరెస్ట్​చేశారు. సాయంత్రానికి వారికి స్టేషన్​బెయిల్​ఇచ్చారు. ఘర్షణకు పాల్పడిన మరికొంత మందిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. 
ఆరేండ్ల పాటు ఐదుగురి సస్పెన్షన్
డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డిపై దాడికి పాల్పడినందుకు పార్టీ తుర్కపల్లి మండల శాఖ మాజీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, పడాల పెద్ద శ్రీనివాస్, అనిల్, కరుణాకర్, నరేశ్​ను పార్టీ నుంచి ఆరేండ్ల పాటు సస్పెండ్​ చేశారు. ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రకటించారు. కొంతమంది కారణంగా పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పిందని ఈ సందర్భంగా సునీత తెలిపారు. మండల అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఇది నచ్చని కొందరు సృష్ణించిన ఘర్షణ కారణంగా చాలామందికి గాయాలయ్యాయని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. 
హైకమాండ్​ను కలుస్తా: పడాల శ్రీనివాస్
తనకు సంబంధం లేని విషయాన్ని సాకుగా చూపించి టీఆర్ఎస్​నుంచి సస్పెండ్ ​చేయడంపై ఆ పార్టీ తుర్కపల్లి మండల మాజీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ ​ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పుట్టుక నుంచి బలోపేతం కోసమే పాటుపడ్డానని చెప్పారు. తన మద్దతుదారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం ఏనాడూ పనిచేయని నరేందర్​రెడ్డిని అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు కార్యకర్తలు ఆగ్రహంతో కొంత గందరగోళం సృష్టించారని చెప్పారు. దీనికి తనను ఎలా బాధ్యుడిగా చేస్తారంటూ నిలదీశారు. చివరకు తన అభిప్రాయం కూడా తెలుసుకోకుండా సస్పెండ్​చేశారని అన్నారు. తనను సస్పెండ్​ చేయడంపై పార్టీ అధినాయకత్వాన్ని కూడా కలుస్తానని చెప్పారు. ఇప్పటికైనా పార్టీ మండల కమిటీ అధ్యక్షుడిని తిరిగి ఎన్నుకోవాలని డిమాండ్​ చేశారు.