ఫ్రెషర్లకు ఐటీ కంపెనీల్లో ఫుల్లు డిమాండ్​

ఫ్రెషర్లకు ఐటీ కంపెనీల్లో ఫుల్లు డిమాండ్​
  • భారీగా నియమించుకున్న ఐటీ కంపెనీలు
  • అట్రిషన్​ ఎఫెక్ట్​ను తప్పించుకునేందుకే..
  • గతంతో పోలిస్తే జీతాలు కూడా ఎక్కువ..

చెన్నై: ఇంజనీరింగ్​ గ్రాడ్యుయేట్లకు మంచి రోజులు వచ్చాయ్. ఉద్యోగుల వలసలను (అట్రిషన్​) తట్టుకోవడానికి, కొత్త డిజిటైజేషన్​ ప్రాజెక్టుల డిమాండ్​ను తీర్చడానికి ఐటీ కంపెనీలు ఫ్రెషర్లను పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. మిడ్​, సీనియర్ లెవెల్స్​ జాబ్స్​కు చాలా గిరాకీ కనిపిస్తోంది. స్పెషలైజ్డ్​ స్కిల్స్ ఉన్న వారికి ఎక్కువ జీతం ఇవ్వడానికి కూడా రెడీ అంటున్నాయి. అన్ని క్యాంపస్​లలోనూ ఫ్రెషర్లకు జీతాలు పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌, విప్రో, కాగ్నిజంట్​, హెచ్​సీఎల్​ టెక్​, టెక్​ మహీంద్రా, యాక్సెంచర్​, క్యాప్​జెమినీ సహా పలు కంపెనీ ఇది వరకే ఈ ఆర్థిక సంవత్సరం కోసం 2.3 లక్షల మందిని తీసుకున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో మరింత మందికి జాబ్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది వరకే 77 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం ఇచ్చామని టీసీఎస్​ చీఫ్​ హెచ్​ఆర్​ మిలింద్​ లక్కడ్​ చెప్పారు. తాజా క్వార్టర్​లో మరింత మందిని తీసుకుంటామని చెప్పారు. కాగ్నిజంట్​ గత సంవత్సరం 33 వేల మందికి ఆఫర్​ లెటర్లు ఇచ్చింది. ఈ ఏడాది దాదాపు 50 వేల జాబ్స్ ఇస్తామని కంపెనీ సీఈఓ బ్రియాన్​ హంఫ్రీస్ వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 70 శాతం ఎక్కువ మంది ఫ్రెషర్లకు వెల్​కమ్​ చెబుతామని విప్రో సీఈఓ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు టాప్​ ఐటీ కంపెనీల్లో 3.60 లక్షల మంది వరకు ఫ్రెషర్లు చేరుతారని రీసెర్చ్​ ఫర్మ్​ అన్​ఎర్త్​ఇన్​సైట్​ పేర్కొంది. మొత్తం ఉద్యోగుల్లో వీరి సంఖ్య 18 శాతానికి చేరవచ్చని పేర్కొంది. కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఐటీ కంపెనీల బిజినెస్​ చాలా బాగుంది కాబట్టే ఫ్రెషర్లకు అవకాశాలు ఇస్తున్నారని అన్​ఎర్త్​ సీఈ గౌరవ్​ వాసు చెప్పారు. ఫ్రెషర్లను తీసుకోవడం ద్వారా ఇవి జీతాల ఖర్చులను తగ్గించుకుంటున్నాయని, మార్జిన్లను పెంచుకుంటున్నాయని అన్నారు. టెక్​ మహీంద్రా వంటి కంపెనీలు టైర్​–2 సిటీల ఫ్రెషర్లపై ఫోకస్​ చేస్తున్నాయి. ఇట్లాంటి సిటీల ఉద్యోగులు జాబ్స్ మానేసే అవకాశాలు చాలా తక్కువ అని కంపెనీ సీనియర్​ లెవెల్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. 

ఫార్మల్​ సెక్టార్​ జాబ్స్​ పెరిగినయ్​...

ఫార్మల్​ సెక్టార్​లో జాబ్స్​ బాగా పెరిగాయని ఎంప్లాయీస్​ ప్రావిడెంట్​ ఫండ్​ ఆర్గనైజేషన్​ (ఈపీఓఎఫ్ఓ) ప్రకటించింది. తాజాగా ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం డిసెంబరు 2020లో 12.5 లక్షల మంది ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో చేరగా, 2021 డిసెంబర్‌లో చేరిన వారి సంఖ్య 14.6  కోట్లు పెరిగింది. అంటే  నికర కొత్త సబ్‌స్క్రయిబర్ల సంఖ్య 16.4 శాతం పెరిగిందని ఈపీఎఫ్​ఓ ప్రకటించింది. అయితే గత ఏడాది నవంబరుతో పోలిస్తే డిసెంబరులో సభ్యుల సంఖ్య 19.9 శాతం ఎగిసి 12.1 కోట్ల నుంచి 13.9 కోట్లకు పెరిగింది. దాదాపు 5.4 లక్షల మంది తిరిగి పీఎఫ్​ ఆర్గనైజేషన్​లో చేరారు. వీరంతా తమ పాత అకౌంట్​ను కొత్త అకౌంట్​లో కలిపేశారు. కొత్తగా చేరిన వారిలో 22–25 ఏళ్ల మధ్య వయసు గల వారి సంఖ్య 0.38 శాతం ఉంది. మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలలోని కంపెనీల నుంచి ఈ నెలలో దాదాపు  89 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు చేరారు.  డిసెంబర్ 2021 నెలలో మొత్తం నికర సబ్‌స్క్రయిబర్లలో 20.52 శాతం మంది మహిళలు ఉన్నారని ఈపీఎఫ్​ఓ పే రోల్​ డేటా చూపించింది.