భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జోష్ ఇస్తూ జీఎస్టీ వసూళ్లు మరోసారి దుమ్ముదులిపేశాయి. పండుగలు ఉన్నా లేకపోయినా.. సామాన్యుల కొనుగోళ్లు, కంపెనీల డిమాండ్ తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఖజానా నిండింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకుంటూ మరిన్ని ఎక్కువ పన్ను వసూళ్లను సాధించి భారత్ తన ఆర్థిక సత్తాను చాటిచెప్పింది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మే నెలలో ఏకంగా రూ.లక్షా 94వేల కోట్ల స్థూల జీఎస్టీ రెవెన్యూ వసూలైంది.
మే 2025లో ఈ వసూళ్లు రూ.లక్షా 88వేల కోట్లుగా ఉండేవి. దానితో పోలిస్తే ఈసారి 3.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ భారీ వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా సెంట్రల్ జీఎస్టీ రూపంలో రూ.37వేల 397 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.45వేల 143 కోట్లు, అలాగే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ద్వారా రూ.51వేల 990 కోట్లు వచ్చాయి. అయితే అంతకంటే ముందు నెల అయిన ఏప్రిల్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయిలో రూ.2లక్షల 43వేల కోట్లు, మార్చిలో రూ.2 లక్షల కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఆ రికార్డులతో పోలిస్తే మే నెల కలెక్షన్లు కొంచెం తగ్గినప్పటికీ.. మొత్తంగా చూస్తే మాత్రం వసూళ్ల జాతర అదిరిపోయిందనే చెప్పాలి.
అసలు జీఎస్టీ వసూళ్లు ఈ రేంజ్‌లో దూసుకుపోవడానికి ప్రధాన కారణం వస్తువులు, సేవల సరఫరా మెరుగుపడటమే. అంతేకాదు విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై పన్ను వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. దేశీయంగా డిమాండ్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి వస్తువుల సరఫరాపై పన్ను 26.9 శాతం పెరగడమే నిదర్శనం. సర్వీస్ సెక్టార్‌లో కూడా 22.2 శాతం వృద్ధి కనిపించింది. ఇక విదేశీ దిగుమతులపై వచ్చే ఐజీఎస్‌టీ కలెక్షన్లు 19.1 శాతం పెరిగి రూ.59వేల 654 కోట్లకు చేరాయి. అంటే దేశంలో పారిశ్రామిక రంగానికి సంబంధించిన యాక్టివిటీ ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ : జూన్ నెల మనీ గేమ్ షురూ..
కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలలైన ఏప్రిల్, మే నెలల కలెక్షన్లను కలిపి చూస్తే.. గతేడాది కంటే 6.2 శాతం వృద్ధితో ఏకంగా రూ.4లక్షల 37వేల కోట్ల జీఎస్టీ వసూలైంది. రీఫండ్స్ అన్నింటినీ మినహాయించిన తర్వాత చూసుకుంటే.. నికర జీఎస్టీ ఆదాయం 3.3 శాతం పెరిగి రూ.లక్షా 67వేల కోట్లుగా నమోదైంది. గతేడాది సెప్టెంబర్ 2025లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ కూడా ఈ భారీ వసూళ్లకు బాగా హెల్ప్ అయింది. పన్నుల విధానాన్ని సరళతరం చేస్తూ 5%, 18% ప్రధాన స్లాబులుగా మార్చడం, లగ్జరీ వస్తువులపై 40% రేటును పెట్టడం వల్ల సామాన్యులపై భారం తగ్గడమే కాకుండా.. ప్రభుత్వానికి టాక్స్ కలెక్షన్లు కుమ్మేసేలా చేశాయి.
