
- 38 రన్స్ తేడాతో జీటీ గ్రాండ్ విక్టరీ
- దంచికొట్టిన గిల్, బట్లర్
అహ్మదాబాద్: ఐపీఎల్–18లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైనట్టే. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్ రైజర్స్ ఈసారి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టనుంది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో బ్యాటర్లు ఫెయిలవడంతో మెగా లీగ్‌లో కమిన్స్‌సేన ఏడోసారి ఓడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (38 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76), జోస్ బట్లర్ (37 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) సూపర్ బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు సత్తా చాటడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 38 రన్స్ తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. రైజర్స్‌పై రెండోసారి పైచేయి సాధించిన జీటీ మొత్తంగా ఏడో విక్టరీతో ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేసింది. ఈ వన్‌సైడ్ పోరులో తొలుత టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 224/6 స్కోరు చేసింది.
ఓపెనర్ సాయి సుదర్శన్ (23 బాల్స్‌లో 9 ఫోర్లతో 48) కూడా రాణించాడు. ఉనాద్కట్ (3/35) మూడు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (41 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 74) పోరాడినా మిగతా వాళ్లు నిరాశపరచడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 186/6 స్కోరు చేసి ఓడిపోయింది. జీటీ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ (2/19), మహ్మద్ సిరాజ్ (2/33) చెరో రెండు వికెట్లతో దెబ్బకొట్టారు. ప్రసిధ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్ రైజర్స్ పోటీపడనుంది.
దంచుడే దంచుడు
ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ తమ సూపర్ ఫామ్‌ను కొనసాగించడంతో పాటు జోస్ బట్లర్ దంచికొట్టడంతో గుజరాత్ భారీ స్కోరుచేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్ ఫస్ట్ ఓవర్ నుంచే తడాఖా చూపెట్టింది. షమీ వేసిన ఇన్నింగ్స్ మూడో బాల్‌నే సిక్స్‌గా మలచిన గిల్ తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. షమీ తర్వాతి ఓవర్లోనే సుదర్శన్ ఐదు ఫోర్లతో విజృంభించాడు. ఆపై కమిన్స్‌కు గిల్ రెండు ఫోర్లు, సిక్స్‌తో స్వాగతం పలకడంతో నాలుగు ఓవర్లకే స్కోరు 50 దాటింది.
హర్షల్ బౌలింగ్‌లో సుదర్శన్ మరోసారి హ్యాట్రిక్ సహా నాలుగు ఫోర్లతో జోరు చూపెట్టాడు. ఓపెనర్ల దెబ్బకు పవర్ ప్లేలోనే జీటీ 82/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ జీషన్ అన్సారీ.. సుదర్శన్‌ను ఔట్ చేసి రైజర్స్‌కు తొలి బ్రేక్ అందించాడు. తర్వాతి ఓవర్లో కమిన్స్ నాలుగు రన్సే ఇవ్వడంతో సన్ రైజర్స్ పుంజుకున్నట్టు అనిపించింది. కానీ, వన్ డౌన్‌లో వచ్చిన బట్లర్.. గిల్ తోడుగా భారీ షాట్లతో రెచ్చిపోయాడు.
అన్సారీ బౌలింగ్‌లో సిక్సర్ల ఖాతా తెరిచిన అతను షమీ వేసిన పదో ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. రెండు ఫోర్లు రాబట్టిన గిల్ 26 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సగం ఓవర్లకు జీటీ 120/1 స్కోరుతో నిలిచింది. సెంచరీ చేసేలా కనిపించిన గిల్.. 13వ ఓవర్లో రనౌటవ్వడంతో రెండో వికెట్‌కు 62 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. గిల్ వెనుదిరిగినా బట్లర్ వెనక్కు తగ్గలేదు. తన మార్కు క్లాసిక్ షాట్లతో ఫోర్లు, సిక్సర్లు కొట్టిన అతను 31 బాల్స్‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో 4, 6 బాదడంతో 18 ఓవర్లలో స్కోరు 200 దాటింది. కమిన్స్ వేసిన తర్వాతి ఓవర్లో బట్లర్ ఔటైనా.. షారూక్ ఖాన్ (6 నాటౌట్) సిక్స్ కొట్టాడు. చివరి ఓవర్లో ఉనాద్కట్ మూడు వికెట్లు పడగొట్టినా.. సుందర్ (21), తెవాటియా (6) చెరో సిక్స్ కొట్టడంతో జీటీ స్కోరు 220 మార్కు దాటింది.
అభి మెరిసినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌ను సన్ రైజర్స్ కూడా ధాటిగానే మొదలు పెట్టింది. ఇన్నింగ్స్ రెండో బాల్‌కు అభిషేక్ శర్మ సిక్స్ కొట్టగా.. నాలుగో బాల్‌కు ట్రావిస్ హెడ్ (20) బౌండ్రీ రాబట్టాడు. ఇషాంత్ ను టార్గెట్‌ను చేసిన అభి అతని బౌలింగ్‌లో రెండు సిక్సర్లు రాబట్టాడు. కానీ, ప్రసిధ్ కృష్ణ వేసిన ఐదో ఓవర్లో రషీద్ ఖాన్ పట్టిన చురుకైన క్యాచ్‌కు హెడ్ ఔటవ్వడంతో తొలి వికెట్‌కు 49 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది.
పవర్ ప్లేను రైజర్స్ 57/1తో ముగించగా.. ఫీల్డింగ్ మారిన తర్వాత జీటీ బౌలర్లు పుంజుకున్నారు. మూడు ఓవర్లలో ఒకే బౌండ్రీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రసిధ్ కృష్ణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అభి నెమ్మదించగా.. క్రీజులో ఇబ్బంది పడ్డ వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (17)ను ప్రసిధ్ ఔట్ చేయడంతో సగం ఓవర్లకు రైజర్స్ స్కోరు 85/2గా మారింది. అయితే, రషీద్ బౌలింగ్‌లో అభి, క్లాసెన్ (23) చెరో సిక్స్ కొట్టి స్కోరు వంద దాటించడంతో పాటు ఛేజింగ్‌కు మళ్లీ ఊపు తెచ్చారు.
కొయెట్జీ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ మీదుగా ఖతర్నాక్ సిక్స్ కొట్టిన అభి 28 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రషీద్ బౌలింగ్‌లో 6, 4 కొట్టినా.. క్లాసెన్ వేగంగా ఆడలేకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్ పెరిగింది. 14వ ఓవర్లో ప్రసిధ్ నాలుగు రన్సే ఇవ్వడంతో చివరి ఆరు ఓవర్లలో రైజర్స్‌కు 98 రన్స్ అవసరం అయ్యాయి. అభి, క్లాసెన్ క్రీజులో ఉండటంతో జట్టు ఆశలు కోల్పోలేదు.
కానీ, ఇషాంత్ బౌలింగ్‌లో అభి భారీ షాట్‌కు ట్రై చేసి సిరాజ్‌కు క్యాచ్ ఇవ్వగా.. తర్వాతి ఓవర్లోనే క్లాసెన్‌ను కీపర్ క్యాచ్‌తో ప్రసిధ్ వెనక్కు పంపడంతో 141/4తో రైజర్స్ డీలా పడింది. తర్వాతి ఓవర్లోనే సిరాజ్ వరుస బాల్స్‌లో అనికేత్ వర్మ (3), కమిందు మెండిస్ (0)ను పెవిలియన్ చేర్చడంతో జీటీ విజయం ఖాయమైంది. చివర్లో నితీష్ రెడ్డి (21 నాటౌట్), కెప్టెన్ కమిన్స్ (19 నాటౌట్) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
అంపైర్‌పై గిల్ గుస్సా
ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లతో జీటీ కెప్టెన్ గిల్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ప్రసిధ్ వేసిన 14వ ఓవర్లో అభిషేక్ ఎల్బీ అప్పీల్‌ను అంపైర్ తిస్కరించడంతో డీఆర్‌ఎస్ కోరాడు. యార్కర్ బాల్‌కు అభి షాట్ మిస్సవ్వగా అది అతని కాలు బొటన వేలిపై పడి వెళ్లిపోయింది. రివ్యూలో బాల్ ఎక్కడ పిచ్ అయిందో స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ ఒరిజినల్ నిర్ణయం ప్రకారం నాటౌట్ ఇచ్చాడు. దీనిపై గిల్ అంపైర్ కన్నూర్‌తో వాదనకు దిగాడు. అభిషేక్ వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా గిల్ వెనక్కుతగ్గలేదు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 224/6 (గిల్ 76, బట్లర్ 64, సుదర్శన్ 48, ఉనాద్కట్ 3/35)
సన్ రైజర్స్: 20 ఓవర్లలో 186/6 (అభిషేక్ 74, ప్రసిధ్ 2/19, సిరాజ్ 3/33)