
- రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలి
- ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: ‘సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి, హామీలన్నింటిని అమలు చేసే వరకు వెంటపడుతాం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని సిరిసిల్ల ఎమ్యెల్యే కేటీఆర్ విమర్శించారు. శనివారం సిరిసిల్లలో చేపట్టిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం క్రికెట్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎండిన పంటలకు ఎకరానికి రూ. 25 వేలు చెల్లించాలని, క్వింటాల్ వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని, ఇందుకోసం ఎలక్షన్ కమీషన్‌కు లెటర్ రాయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దుష్ట్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై రాజకీయాలు మాని, మేడిగడ్డను రిపేర్ చేసి సాగునీళ్లు ఇవ్వాలన్నారు. 300 పిల్లర్లలో ఓ రెండు పిల్లర్లు కుంగితే రాద్దాంతం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం పనికిరాదని కొందరు మీడియా పేరిట యూట్యూబ్‌లో ప్రచారం చేస్తూ కేసీఆర్‌ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మేడిగడ్డకు రిపేర్ చేస్తే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకు వెంటపడుతామన్నారు.
మా మీద కోపం రైతుల మీద చూపకండి : హరీశ్‌రావు
సంగారెడ్డి, వెలుగు : మా మీద కోపం ఉంటే ఎంతైనా తిట్టండి.. కానీ రైతులను మాత్రం ఆదుకోండి’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డిలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 200 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, చనిపోయిన రైతుల ఫ్యామిలీలకు రూ. 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కేసీఆర్ పాలనలో పంటలు పండితే, కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేందుకే తాము దీక్షలు చేపడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, జహీరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గాలి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.