మరో కార్పొరేట్ మోసం వెలుగులోకి వచ్చింది. గౌతమ్ థాపర్ ప్రమోట్ చేసే సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యుషన్ లిమిటెడ్‌లో పాలన, ఆర్థికపరమైన లోపాలు జరిగినట్టు బోర్డు ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. వందల కోట్ల రూపాయలను ఈ గ్రూప్ తక్కువ చేసి చూపించినట్టు కూడా బోర్డు విచారణలో తేలింది. సేకరించిన నిధులను కూడా కంపెనీ నుంచి దారి మళ్లించినట్టు ఎక్సేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇందుకు ఉద్యోగులే కారణమని తెలిపింది. వీరిలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు ఉన్నారు. కంపెనీ అప్పులను తక్కువ చేసి చూపించడమే కాకుండా.. కంపెనీకి సంబంధించిన, సంబంధం లేని పార్టీలకు ఇచ్చిన అడ్వాన్స్ విషయంలోనూ అవకతవకలు జరిగినట్టు బోర్డు గుర్తించింది. 2018 మార్చి 31 నాటికి తక్కువ చేసి చూపించిన అడ్వాన్స్‌లు కంపెనీవి రూ.1,990.36 కోట్లుగా, గ్రూప్‌వి రూ.2,806.63 కోట్లుగా ఉన్నాయి. తక్కువ చేసి చూపించిన మొత్తం అప్పుల్లో కంపెనీవి 2018 మార్చి 31 నాటికి రూ.1,053.54 కోట్లు, గ్రూప్‌వి రూ.1,608.17 కోట్లుగా ఉన్నట్టు బోర్డు విచారణలో తేలింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా అనధికారిక, అవసరం లేని రైటాఫ్‌లతో కంపెనీ నికర విలువను కూడా తక్కువ చేసినట్టు ఫైలింగ్‌లో సీజీ పవర్ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో సీజీ పవర్ షేర్లు 20 శాతం మేర క్రాష్ అయ్యాయి.
