నీటి నిర్వహణపై గ్రామ పంచాయతీలకు గైడ్ లైన్స్ విడుదల

నీటి నిర్వహణపై గ్రామ పంచాయతీలకు గైడ్ లైన్స్ విడుదల

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో నీటి నిర్వహణపై గైడ్ లైన్స్ ను మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు. ఇటీవల ప్రభుత్వం గ్రామాల్లో నీటి సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరథ అధికారులు రోజువారీగా చేయాల్సిన అంశాలను గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.

గ్రామాలకు వస్తున్న నీటి పరిమాణం, స్కూళ్లు, అంగన్ వాడీలకు అందిస్తున్న నీళ్లు, ఇంటింటికి నల్లా కనెక్షన్లు, నల్లా మరమ్మతులు అన్నింటిని మిషన్ భగీరథ ఏఈ, ఏఈఈలు పర్యవేక్షించాలని తెలిపారు. డైలీ నీటి సరఫరా రిపోర్ట్ లు రెడీ చేసి అందించాలని ఈఎన్సీ చెప్పారు. ప్రతి 10 రోజులకు ఒకసారి గ్రామాల్లో ఉండే వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేయించాలని ఆదేశించారు. బ్లీచింగ్ పౌడర్ 3 నెలలకు సరిపడా నిల్వ చేసుకోవాలని పేర్కొన్నారు. సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఈఎన్సీ సూచించారు.