
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ షెడ్యూల్ వెలువడే అవకాశముంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ సమయంలోనే గుజరాత్ షెడ్యూల్ కూడా విడుదలవుతుందని భావించినా అలా జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు 12గంటలకు ఈసీ గుజరాత్ ఎన్నికల తేదీని ప్రకటించనుంది. ఆ రాష్ట్రంలో డిసెంబర్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించకముందే ఆప్ తన అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలోనే ఉన్నాయి.
గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఫిబ్రవరిలో ముగియనుంది. మామూలుగా గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీతో సీన్ మారే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల లిస్టు విడుదల చేయడంతో గుజరాత్లో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయమని తెలుస్తోంది.