గుజరాత్లో కొనసాగుతున్న తొలి దశ పోలింగ్

గుజరాత్లో కొనసాగుతున్న తొలి దశ పోలింగ్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. తొలిదశలో 19 జిల్లాల్లో ఓటింగ్ జరుగుతోంది. దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ సతీ సమేతంగా నవ్సారీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. నార్త్ జామ్ నగర్ నుంచి పోటీలో ఉన్న క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజ్ కోట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తొలి విడతలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్​తో పాటు మొత్తం 36 పార్టీలు అభ్యర్థుల్ని బరిలోకి నిలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ 89స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్​ 88 మంది అభ్యర్థుల్ని బరిలో దింపింది. ఇక బీఎస్పీ 57, భారతీయ ట్రైబల్​పార్టీ 14, సీపీఎం 4 స్థానాల్లో పోటీ చేస్తోంది. 339 మంది ఇండిపెండెంట్లుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 788 మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళలున్నారు. వీరిలో బీజేపీ నుంచి 9 మంది, కాంగ్రెస్​ నుంచి 6, ఆప్​ నుంచి ఐదుగురు పోటీలో ఉన్నారు.