గుజరాత్ లో 89 నియోజకవర్గాల్లో రేపు తొలివిడత పోలింగ్​

గుజరాత్ లో 89 నియోజకవర్గాల్లో రేపు తొలివిడత పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. అధికార బీజేపీతో పాటు ఆమ్​ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ప్రచారం సాగించాయి. కేంద్ర మంత్రులతో పాటు, పలు రాష్ట్రాల సీఎంలు గుజరాత్​ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పలుమార్లు రాష్ట్రానికి వచ్చారు. ఆమ్​ ఆద్మీ పార్టీ చీఫ్​ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ వ్యూహాత్మకంగా ప్రచారం చేశారు. పంజాబ్​లో ఫాలో అయిన విధానాన్నే గుజరాత్​లోనూ ఉపయోగించారు. మీకు కాబోయే సీఎంగా ఎవరుండాలో మీరే నిర్ణయించుకోండంటూ పోల్​ నిర్వహించి, ఇసుదాన్​ గాధ్వి ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.

గుజరాత్​మళ్లీ మాదేనంటున్న బీజేపీ..

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో పాటు అభివృద్ధి మోడల్​ను చూపుతూ అధికారం నిలబెట్టుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రజల మనసులు గెలుచుకుని గడిచిన 27 ఏండ్లుగా అధికారంలో కొనసాగుతున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, సుదీర్ఘ కాలంగా పరిపాలిస్తున్నా రాష్ట్రాన్ని బీజేపీ అభివృద్ధి పథంలో నడిపించలేకపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. పార్టీ ప్రెసిడెంట్​ మల్లికార్జున ఖర్గే తో సహా పలువురు ఢిల్లీ నేతలు గుజరాత్​లో ప్రచారం చేశారు.​ జోడో యాత్రలో ఉన్న రాహుల్​ గాంధీ కూడా ప్రచారం నిర్వహించారు. రాజస్థాన్​ సీఎం గెహ్లాట్​సహా పలువురు సీనియర్​ నేతలు గుజరాత్​లో ప్రచారం నిర్వహించారు. మరోవైపు, పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య విజయంతో ఆమ్​ ఆద్మీ పార్టీలో కూడా ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతోంది. పంజాబ్​ తరహాలోనే గుజరాత్​ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మకంతో ఉంది. పార్టీ చీఫ్ కన్వీనర్​ అర్వింద్​ కేజ్రీవాల్ గుజరాత్​ ప్రజలకు హామీలను గుప్పిస్తున్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందజేస్తామని, నిరుద్యోగులకు భృతి, ఉద్యోగులకు పాత పెన్షన్​ ను మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

తొలి దశ ఎన్నికల లెక్కలు..

పోలింగ్ తేదీ: డిసెంబర్ 1
ఎన్ని నియోజకవర్గాలు: 89
బరిలో ఉన్న అభ్యర్థులు..: 788
రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాలు: 182
రెండో దశ ఎన్నికలు..: డిసెంబర్​ 5న
ఫలితాల ప్రకటన..: డిసెంబర్​ 8న