గుజరాత్​లోని మోర్బిలో ఘోరం

గుజరాత్​లోని మోర్బిలో ఘోరం
  • 91 మంది మృతి
  • మరో 100 మంది మిస్సింగ్​.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  • 140 ఏండ్ల నాటి బ్రిడ్జ్.. రీఓపెన్ అయిన 4 రోజులకే ప్రమాదం

అహ్మదాబాద్: గుజరాత్​లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బి వద్ద మచ్చూ నదిపై ఉన్న 140 ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కూలిపోయింది. ప్రమాదంలో 91మంది చనిపోయారు. మరో100 మందికి పైగా గల్లంతయ్యారు. చాలా మందికి గాయాలయ్యాయి. బ్రిడ్జికి రిపేర్లు చేసి, నాలుగు రోజుల కిందటే రీఓపెన్ చేయగా.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మంది వరకూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీంలు ఇప్పటివరకూ 70 మందిని కాపాడాయని మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బ్రిజేశ్​ మేర్జా తెలిపారు. రెస్క్యూ టీంలు, మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు బాధితులను కాపాడేందుకు స్థానికులు సహాయం చేస్తున్నారని చెప్పారు. బాధితుల్లో చాలా మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందన్నారు. సీఎం భూపేంద్ర పటేల్ తో పాటు హోం మంత్రి హర్ష సంఘావి, హెల్త్ మినిస్టర్ రిషికేశ్ పటేల్ ప్రమాద స్థలానికి బయలుదేరారు. బ్రిడ్జి నదిలో ఓ వైపు పూర్తిగా నీటిలో పడిపోయింది. మరోవైపున కొద్దిగా వేలాడుతూ ఉన్న బ్రిడ్జిని, కేబుల్స్ ను పట్టుకుని చాలా మంది బాధితులు పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటం, కొందరు నీళ్లలో ఈదుతుండటం వీడియోల్లో కనిపించింది. బ్రిడ్జి ఉన్నట్టుండి ఒక్కసారిగా మధ్యలో విరిగిపోయిందని, క్షణాల్లోనే కుప్పకూలిపోయిందని తెలుస్తోంది. ప్రమాదానికి దారి తీసిన కారణాలపై ఇంకా వివరాలు వెల్లడికావాల్సి ఉంది.    

లోడ్ ఎక్కువైనందుకే కూలిందా?

మోర్బి టౌన్ వద్ద మచ్చూ నదిపై ఉన్న ఈ చరిత్రాత్మక కేబుల్ బ్రిడ్జిని 140 ఏండ్ల కిందట అప్పటి మోర్బి మహారాజు కట్టించారు. పాతబడిపోవడంతో చాలా ఏండ్ల కిందటే దీనిని మూసివేశారు. ఇటీవలే రిపేర్లు, రెనోవేషన్ పనులు చేశారు. బ్రిడ్జి రిపేర్ పనులను రూ. 8 కోట్లతో ఓధ్వాజీ రాఘవ్ జీ (ఓఆర్) పటేల్ కు చెందిన ఓరెవా గ్రూప్ కంపెనీ నిర్వహించింది. గుజరాత్ న్యూఇయర్ సందర్భంగా ఈ నెల 26వ తేదీనే బ్రిడ్జిని రీఓపెన్ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే ఈ ఘోరం జరిగిపోయింది. అయితే, బ్రిడ్జిపై 100 మందికి మించి ఎక్కకూడదని రిపేర్ పనులను పర్యవేక్షించిన సంస్థ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడం, దీపావళి, ఛత్ పూజ నేపథ్యంలో  జనం విపరీతంగా రావడం.. ఒకేసారి దాదాపు 500 మందికిపైగా బ్రిడ్జి పైకి వెళ్లడం వల్లే అది కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు బ్రిడ్జి కూలిపోవడానికి ముందు తీసినట్లు చెప్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ యువకుడు కేబుల్ ను బలంగా తన్నడం, కొందరు కేబుల్స్ ను పట్టుకుని ఊపుతుండటం.. బ్రిడ్జి గాలిలో అటూఇటూ ప్రమాదకరంగా ఊగడం వంటి దృశ్యాలు వీడియోలో కన్పించాయి.   

మృతుల ఫ్యామిలీలకు రూ.6 లక్షలు  

గుజరాత్ పర్యటనలోనే ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఎం భూపేంద్ర పటేల్ తో మాట్లాడారు. వెంటనే అత్యవసర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని ఆదేశించారు. రెస్క్యూ చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తామని మోడీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మృతుల ఫ్యామిలీలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.