OMG : 16 వేల గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్.. గుండెపోటుతో మృతి

OMG : 16 వేల గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్.. గుండెపోటుతో మృతి

అతని పేరు డాక్టర్ గౌరవ్ గాంధీ. రాష్ట్రం గుజరాత్. నివాసం జామ్ నగర్. 41 ఏళ్ల గౌరవ్ గాంధీ ప్రముఖ కార్డియాలజిస్ట్ గా పేరు పొందారు. ఇప్పటి వరకు 16 వేల గుండె ఆపరేషన్లు చేశారు. జామ్ నగర్ మొత్తం తెలుసు డాక్టర్ గౌరవ్ అంటే. హస్తవాసి బాగుంటుందని.. వెయిట్ చేసి మరీ గౌరవ్ తోనే ఆపరేషన్లు చేయించుకునే వారు పేషెంట్లు.. అలాంటి డాక్టర్ గౌరవ్.. కార్డియాక్ అరెస్ట్.. తీవ్ర గుండెపోటుతో చనిపోవటం షాక్ కు గురి చేసింది. 

జూన్ 6వ తేదీ రాత్రి వరకు ఆస్పత్రిలో పేషెంట్లను చూసి.. జామ్ నగర్ ప్యాలెస్ రోడ్డులోని తన ఇంటికి వచ్చారు. రోజు మాదిరిగానే డిన్నర్ చేసి రాత్రి 11 గంటల సమయంలో నిద్ర పోయారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు లేచి వాకింగ్ కు వెళ్లే డాక్టర్ గౌరవ్.. 2023 జూన్ 7వ తేదీ బుధవారం ఉదయం నిద్ర లేవలేదు. బయట వర్షం పడుతుండటంతో.. నిద్ర లేవలేదని భావించిన కుటుంబ సభ్యులు.. అతన్ని డిస్ట్రబ్ చేయలేదు. 7 గంటల తర్వాత కూడా నిద్ర లేవకపోవటంతో.. ఇంట్లోని కుటుంబ సభ్యులు నిద్ర లేపారు. ఉలుకూ పలుకూ లేకపోవటంతో.. భయమేసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు డాక్టర్లు.

41 ఏళ్ల డాక్టర్ గౌరవ్.. నిద్రలోనే తీవ్ర గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయినట్లు చెబుతున్నారు డాక్టర్లు. కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రాత్రి పడుకునే మందు అందరితో మాట్లాడాడని.. ఎలాంటి అనారోగ్యం అని చెప్పలేదని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. 

41 ఏళ్ల వయస్సుకే 16 వేల గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేసిన డాక్టర్ గౌవర్ ఇక లేరన్న విషయం తెలిసి జామ్ నగర్ లోని డాక్టర్లతోపాటు.. ప్రజలు షాక్ అయ్యారు. దేశంలోనే అతి చిన్న వయస్సులోనే ప్రముఖ కార్డియాలజిస్ట్ గా పేరు పొందిన గౌరవ్.. అదే గుండెపోటుతో చనిపోవటం డాక్టర్ల ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఇలాంటి ప్రముఖ కార్డియాలజిస్టులే గుండెపోటుతో చనిపోతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.