
గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి మొదటి ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. వీటిలో 142 జనరల్ కాగా.. 17 ఎస్సీ , 23 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. గుజరాత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ పోటీ చేస్తోంది. ప్రచారంలోనూ బీజేపీకి ధీటుగా దూసుకుపోయింది. దీంతో ఈసారి త్రిముఖ పోటీ ఏర్పడింది. రెండో ఫేజ్ డిసెంబర్ 5న జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటించనున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 16 వందల 21 మంది అభ్యర్థుల్లో 330 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లలో 61 మంది అభ్యర్థులతో.. ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ నుంచి 60 మంది, బీజేపీ నుంచి 32 మంది క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 111 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 62స్థానాలతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. 1990 జనతాదళ్ తో కలిసి బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. 1995 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చింది. మధ్యలో శంకర్ సిన్హ్ వాఘేలా తిరుగుబాటు చేసిన రెండేళ్లు తప్ప మిగతా అంతా బీజేపీనే అధికారంలో ఉంది. ఈ సారి కూడా అదే జోరు కొనసాగించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.