
- రెండు దశల్లో నిర్వహణ.. షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
- 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్: షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
- తొలి దశకు రేపు నోటిఫికేషన్
- డిసెంబర్ 8 న ఫలితాలు
- హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల రిజల్ట్స్ కూడా అదే రోజు
గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలోని 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తొలి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న, రెండో దశలో 93 స్థానాలకు 5న ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనూ ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. గుజరాత్‌లో మరోసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘గుజరాత్ ప్రజలకు నా ప్రేమపూర్వక సందేశం’ పేరుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోను ట్వీట్ చేశారు. ఇక, 2017 ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి వరుసగా ఆరో సారి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. 77 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి 49 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు పడ్డాయి.
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలోని 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తొలి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న, రెండో దశలో 93 స్థానాలకు 5న ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అదే రోజు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. గురువారం ఢిల్లీలోని ప్రసార భారతి భవన్ లో కేంద్ర ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, డిప్యూటీ కమిషనర్లతో కలిసి రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. మోర్బీ ఘటన కారణంగా షెడ్యూల్ కాస్త ఆలస్యమైందని రాజీవ్ కుమార్ తెలిపారు. గుజరాత్‌లో 142 జనరల్ స్థానాలు, 13 ఎస్సీ రిజర్వ్‌డ్, 27 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నట్లు చెప్పారు.
51 వేల పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇందుకు 51,782 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. ఈసారి ఎన్నికల్లో 27, 943 సర్వీస్ ఓటర్లను కలుపుకొని మొత్తం 4,91,17,308 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
నేర చరిత్ర ఉంటే..
క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లకు టికెట్ ఇస్తే.. సదరు వ్యక్తిని అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రజలకు రాజకీయ పార్టీలు చెప్పాల్సి ఉంటుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. నేర చరిత లేని వాళ్లను ఎందుకు నిలబెట్టలేకపోయారనేదీ చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని మాధ్యమాల ద్వారా వెల్లడించాలని స్పష్టం చేశారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్లు తమ గురించి ప్రాంతీయ, నేషనల్ పేపర్లలో, సోషల్ మీడియాలో వెల్లడించాలని పేర్కొన్నారు. ఇలా 3 సార్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిష్ చేయాల్సి ఉంటుందని సూచించారు.
గుజరాత్‌కు కేజ్రీ ‘ప్రేమ’ సందేశం
ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘గుజరాత్ ప్రజలకు నా ప్రేమపూర్వక సందేశం’ పేరుతో ఒక నిమిషం ఉన్న వీడియోను ట్వీట్ చేశారు. ‘‘నేను మీ సోదరుడిని.. మీ ఇంట్లో ఒకడిని. ఒక్క అవకాశం ఇవ్వండి. మీకు ఉచితంగా కరెంటు ఇస్తాం. స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మిస్తాను. ఆయోధ్యలో రాముడి గుడికి తీసుకెళ్తాను” అని కోరారు.
ఆరు రాష్ట్రాల్లో ఏడు సీట్లకు బైపోల్
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ సీట్లకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, హర్యానాలోని అదంపూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకర్‌నాథ్, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో పోలింగ్ జరిగింది. వీటి ఫలితాలు ఈ నెల 6న వెలువడుతాయి.
హిమాచల్ ఫలితాలు ఆలస్యం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 12న ఒకే దశలో జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న గుజరాత్‌తోపాటు ఇవ్వనున్నారు. హిమాచల్ ఫలితాలు ముందుగా వస్తే.. ఆ ప్రభావం గుజరాత్ ఎన్నికలపై పడ్తుందనే ఆలస్యంగా ఇవ్వనున్నారు.
పక్షపాతం చూపలే: ఈసీ
గుజరాత్ ఎన్నికల ప్రకటన విషయంలో ఆలస్యం చేసి పక్షపాత వైఖరి అవలంభించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఈసీ రాజీవ్ కుమార్ కొట్టిపారేశారు. ‘‘2023 ఫిబ్రవరి 18 దాకా గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ఉంది. 110 రోజుల ముందే ఎన్నికలను ప్రకటించాం. చాలా అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం. నిజానికి కొన్ని రోజులు ముందుగా ఎన్నికలను ప్రకటించాల్సింది. కానీ గుజరాత్‌లో జరిగినమోర్బీ బ్రిడ్జి ప్రమాదం కూడా ఓ కారణం’’ అని సీఈసీ చెప్పుకొచ్చారు.
ఎన్నికల షెడ్యూల్
నవంబర్ 5 : ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్
నవంబర్ 14 : నామినేషన్లకు చివరి తేదీ
నవంబర్ 15 : నామినేషన్ల పరిశీలన
నవంబర్ 17 : నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్ 1 : పోలింగ్
డిసెంబర్ 8 : ఫలితాలు
నవంబర్ 10 : సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్
నవంబర్ 17 : నామినేషన్లకు చివరి తేదీ
నవంబర్ 18 : నామినేషన్ల పరిశీలన
నవంబర్ 21 : నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబర్ 5 : పోలింగ్
డిసెంబర్ 8 : ఫలితాలు