గుజరాత్​ లో ఇయ్యాల్నే ఫస్ట్​ ఫేజ్ పోలింగ్​

గుజరాత్​ లో ఇయ్యాల్నే ఫస్ట్​ ఫేజ్ పోలింగ్​

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్​ ఫేజ్​లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్​ జరగనుంది. మొత్తం 19 జిల్లాల్లో పోలింగ్ జరుగుతుందని, 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చీఫ్​ ఎలక్టోరల్​ ఆఫీసర్​ (సీఈవో) భారతి ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్​ కొనసాగుతుందన్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాల్లో బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్​ 40 స్థానాలను దక్కించుకుంది. ఒక ఇండిపెండెంట్​ అభ్యర్థి విజయం సాధించాడు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్​తో పాటు మొత్తం 36 పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ, కాంగ్రెస్ 89స్థానాల్లో పోటీ చేస్తుంటే, ఆప్​ 88 చోట్ల బరిలో నిల్చుంది. ఇక బీఎస్పీ 57, భారతీయ ట్రైబల్​ పార్టీ 14, సీపీఎం నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నది. 339 మంది ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 788 మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళలున్నారు. వీరిలో బీజేపీ నుంచి 9 మంది, కాంగ్రెస్​ నుంచి ఆరుగురు, ఆప్​ నుంచి 
ఐదుగురు పోటీలో ఉన్నారు. 

89 మోడల్​ పోలింగ్ ​స్టేషన్లు

గుజరాత్​లో 4,91,35,400 మంది ఓటర్లు ఉండగా, ఫస్ట్​ఫేజ్​లో 2,39,76,670 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 18–19 ఏండ్ల వయస్సు వారు 5.74 లక్షలు, 99ఏండ్లు పైబడిన వారు 4,945 మంది ఉన్నారు. మొత్తం 14,382 పోలింగ్​ స్టేషన్స్​ ఏర్పాటు చేశారు. 3,311 కేంద్రాలు అర్బన్​లో ఉండగా, 11,071 కేంద్రాలు రూరల్​ ఏరియాలో ఉన్నాయి. 89 ‘మోడల్ పోలింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌’లను ఏర్పాటు చేశారు. వీటిలో ఎక్కువ స్టేషన్లు హ్యాండీక్యాప్​లతో నిర్వహించబడుతాయి. 89 ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లను 611 మహిళలు నిర్వహిస్తారు. 18 పోలింగ్ కేంద్రాల బాధ్యతలను యూత్ చూసుకుంటున్నది. మొత్తంగా 2,20,288 మంది ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో ఉంటారు. ఫస్ట్​ఫేజ్​లో 27,978 మంది ప్రిసైడింగ్​ ఆఫీసర్లు, 78,985 మంది పోలింగ్​ ఆఫీసర్లు డ్యూటీ చేస్తారు. 

సౌరాష్ట్ర–కచ్​ రీజియన్​ కీలకం

ఆఫ్​ సీఎం కేండిడేట్ ఇసుదాన్ గాధ్వి (ఖంబాలియా), ఆప్​ స్టేట్​ ప్రెసిడెంట్​ గోపాల్​ (కటర్​గాం), క్రికెటర్​ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా(జామ్​నగర్​ నార్త్)తో పాటు పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్న స్థానాలకు గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. సౌరాష్ట్ర–కచ్ రీజియన్​లోని 54 స్థానాలు కాంగ్రెస్​కు ఎంతో కీలకం. 2017 ఎన్నికల్లో ఈ రీజియన్​లో కాంగ్రెస్​ 30 స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో గెలిచింది. సూరత్​ సిటీలోని 12 స్థానాలపై బీజేపీ, కాంగ్రెస్ గురిపెట్టాయి. సూరత్​లో 7 స్థానాల్లో గెలుస్తామని ఆప్​ ప్రకటించింది.

రూ.290 కోట్ల లిక్కర్, డ్రగ్స్ సీజ్

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వివిధ చోట్ల జరిగిన తనిఖీల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ ఏజెన్సీలు రూ.290 కోట్ల విలువైన డ్రగ్స్, లిక్కర్, క్యాష్​ను సీజ్​ చేసినట్టు ఎలక్షన్​ కమిషన్​ తెలిపింది. 2017 ఎన్నికల టైంలో పట్టుబడిన వాటితో పోలిస్తే 10 రెట్లు అధికమని ప్రకటించింది. 2017లో నవంబర్​ 29దాకా సీజ్​ చేసిన వాటి విలువ రూ.27.21 కోట్లు ఉంటే.. తాజా ఎన్నికల్లో రూ.290.24 కోట్లు అని తెలిపింది. గుజరాత్‌‌‌‌‌‌‌‌ ఏటీఎస్‌‌‌‌‌‌‌‌ చేపట్టిన ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో రూ.61.96 కోట్ల విలువైన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారని వివరించింది. రూ.14కోట్లు విలువ చేసే 4లక్షల లీటర్ల లిక్కర్​ను సీజ్​ చేసిందని చెప్పింది. వడోదర (రూరల్), వడోదర సిటీలో భారీగా డ్రగ్స్ నిల్వలు గుర్తించినట్టు ఈసీ ప్రకటించింది. మెఫెడ్రోన్ డ్రగ్ తయారు చేసే రెండు యూనిట్లను గుర్తించి.. రూ.478 కోట్ల విలువైన 143 కిలో సింథటిక్​ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. నదియాడ్, వడోదరకు చెందిన ఐదుగురిని అదుపులో తీసుకొని ఏటీఎస్​ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారని వివరించింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నందున పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఈసీ చెప్పింది.